KBC Show: వివాదంలో అమితాబ్ బచ్చన్ KBC.. ఆపరేషన్ సింధూర్ సైనికులు షోలో!

అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ (KBC) షో ఇప్పుడు వివాదంలో పడింది. ఆపరేషన్ సింధూర్‌లో కీలక పాత్ర పోషించిన ముగ్గురు మహిళా సైనికాధికారులు – కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణ డియోస్థలి – KBC స్పెషల్ ఎపిసోడ్‌లో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న విషయం పై విమర్శలు మొదలయ్యాయి. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న ప్రసారం చేయనున్నారు.

కొందరు నెటిజన్లు, ఆపరేషన్ సింధూర్ వంటి కీలక మిలిటరీ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు రియాలిటీ షోలో ప్రమోషన్ కోసం కనిపించడం సైన్యం గౌరవానికి వ్యతిరేకమని, ఇది సైనికాధికారుల ధైర్యాన్ని తగ్గించే చర్యగా భావిస్తున్నారు. “ఏ ఇతర దేశంలో ఇలాంటి మిలిటరీ ఆపరేషన్ తర్వాత అధికారులు టీవీ షోలలో కనిపిస్తారా?” అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ఈ చర్యను ప్రభుత్వ పీఆర్ స్టెంట్, రాబోయే ఎన్నికల కోసం రాజకీయ ప్రయోజనంగా సైన్యాన్ని ఉపయోగించడం అని విమర్శిస్తున్నారు.

అయితే, మరికొందరు నెటిజన్లు, సైనికాధికారులు చేసిన సేవలను గుర్తించి వారి ధైర్యం, సాహసాన్ని ప్రోత్సహించడం సరైనదని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ ఎపిసోడ్‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

గుర్తు చేసుకోదగిన అంశం, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహాల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉగ్రదాడిలో అనేక భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. భారత సైన్యం, వైమానిక దళం కలిసి కాశ్మీర్‌లోని పాకిస్తాన్ ఆక్రమిత ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, తొమ్మిదికి పైగా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు.

ఈ ఆపరేషన్‌లో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణ డియోస్థలి కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్స్, ఇతర ప్రణాళికలు వీరి ఆధ్వర్యంలో జరిగినాయి.

Leave a Reply