Kangana Ranaut: కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టు షాక్.. మసాలా కలిపారంటూ వ్యాఖ్యలు..!

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టులో పెద్ద షాక్ తగిలింది. రైతు నిరసనలపై ఆమె చేసిన వివాదాస్పద ట్వీట్‌ కేసును రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం “మీరు ఆ ట్వీట్‌కు అనవసరంగా మసాలా జోడించారు” అంటూ కంగనాకు చివాట్లు పెట్టింది.

2020-21లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కంగనా చేసిన ట్వీట్‌లో వృద్ధురాలైన మహిళా రైతును రూ.100 కోసం నిరసనలో పాల్గొన్నట్లు కించపరిచే రీతిలో వ్యాఖ్యానించారు. దీనిపై రైతులు, రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, పంజాబ్‌లోని భటిండాలో ఆమెపై పరువునష్టం సహా క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.

ఈ కేసును రద్దు చేయాలని కంగనా మొదట పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ పిటిషన్ కొట్టివేయబడింది. అనంతరం ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం విచారణలో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మోహతా ధర్మాసనం కంగనా తరఫు వాదనలను విన్న తర్వాత, “ఇది కేవలం ఒక ట్వీట్ కాదు.. మీరు దీనికి మసాలా జోడించి రైతులను అవమానపరిచారు” అని వ్యాఖ్యానించింది.

చివరగా కంగనా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు తీర్పుతో, ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply