IPL 2025: CSK vs MI మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదం.. ఖలీల్, రుతురాజ్ పై ఆరోపణలు..!

ఐపీఎల్ క్రికెట్ మైదానంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆదివారం చెపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) vs ముంబై ఇండియన్స్ (MI) మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు చెలరేగాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వివాదం మరింత ముదిరింది.

ఈ వీడియోలో ఖలీల్ తన బౌలింగ్ స్పెల్ మధ్యలో ఒక చేతిలో బంతి పట్టుకుని, మరో చేతిని తన జేబులో పెట్టుకున్నాడు. అనంతరం జేబులోంచి ఏదో తీసినట్లు కనిపించడంతో, అది బాల్ ట్యాంపరింగ్‌కు సంబంధించి ఏదైనా వస్తువా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా, ఖలీల్ ఆ వస్తువును తన దగ్గరకు వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు అందించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలు వైరల్ అవుతుండటంతో, క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది.

ముంబై ఇండియన్స్ అభిమానులు ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్‌లపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 2016-2017లో CSK ఫ్రాంచైజీ బెట్టింగ్ స్కాంలో ఇరుక్కోవడం వల్ల రెండేళ్ల పాటు నిషేధానికి గురైంది. ఇప్పుడు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు రాగా, ముంబై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో CSKపై మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరిపై దర్యాప్తు జరిపించాలని, అవసరమైతే CSKపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే, ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో తడబడింది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ లాంటి స్టార్ బ్యాటర్లు ఫెయిల్ కావడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితమైంది. ఛేజింగ్ లో చెన్నై కూడా కొంత ఇబ్బందిపడినా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (53), రచిన్ రవీంద్ర (50) అర్ధశతకాలతో CSK కి విజయాన్ని అందించారు. చివర్లో ధోనీ క్రీజులోకి రావడంతో స్టేడియం ఉత్సాహంగా మారింది. చివరి ఓవర్ లో రచిన్ రవీంద్ర సిక్స్ కొట్టడంతో చెన్నై గెలుపును ఖాయం చేసింది.

అయితే మ్యాచ్ తర్వాతి బాల్ ట్యాంపరింగ్ వివాదం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ అంశంపై ఐపీఎల్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Leave a Reply