రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా కొత్తగా 200 రైళ్లను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుపుతోంది. ఈ విషయంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ జూన్ 17న ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న రైళ్లలో 100 మెమూ (MEMU), 50 నమో భారత్, 50 అమృత్ భారత్ రైళ్లు ఉండనున్నట్లు వెల్లడించారు.
ట్రైన్ జర్నీని ఇష్టపడే వారు దేశంలో కోట్లాదిమంది ఉన్నారు. దూర ప్రయాణాల్లో రైలు ప్రయాణం ఖర్చు తక్కువగా ఉండడమే కాకుండా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ నేపథ్యంతో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే తరచూ కొత్త మార్గాలు, సేవలను ప్రవేశపెడుతోంది.
यात्रियों की सुविधा के लिए:
🚉 50 नई नमो भारत ट्रेन
🚉 100 नई MEMU ट्रेन
🚉 50 नई अमृत भारत ट्रेन pic.twitter.com/2hM92vq3Ep— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2025
తాజా ప్రకటనలో భాగంగా ప్రవేశపెట్టనున్న నమో భారత్ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ఇందులో స్టాండింగ్, సీటింగ్ ఏర్పాట్లు మెట్రో రైళ్ల మాదిరిగా ఉండడం విశేషం. ఇవి అత్యాధునిక డిజైన్‌తో, ప్రయాణికుల భద్రత, సౌలభ్యం దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి.
అలాగే మెమూ (MEMU) రైళ్లు తక్కువ దూర ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇవి రద్దీగా ఉండే రూట్లలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించగలవని అధికారులు చెబుతున్నారు.
ఈ రైళ్లు 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. దీనివల్ల రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభవం లభించనుంది.