IND vs PAK : మళ్లీ భారత్ vs పాకిస్తాన్ పోరు.. ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్ వివరాలు

ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మరోసారి హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. సూపర్ 4 రౌండ్‌లో భాగంగా సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో భారత్‌పై పాక్ ఘోర పరాజయం పాలైంది. ఒకవేళ ఇండియా, పాకిస్తాన్ రెండూ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఈ రెండు జట్ల మధ్య ఆసియా కప్ 2025లో మూడోసారి పోరు జరగనుంది.

గ్రూప్-A నుంచి భారత్, పాక్ సూపర్-4కు చేరగా, గ్రూప్-B నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లు సూపర్-4లో ఉన్నాయి. ఒక్కో జట్టు సూపర్-4లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది.

ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు యూఏఈపై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. పాక్ ఆటగాళ్లలో ఫకర్ జమాన్ (50), షాహీన్ అఫ్రీది (29*), సల్మాన్ అఘా (20) రాణించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ 4, సిమ్రన్ జిత్ 3, ధ్రువ్ 1 వికెట్ తీశారు.

టార్గెట్ ఛేజ్‌లో యూఏఈ జట్టు 105 పరుగులకే ఆలౌట్ అయింది. రాహుల్ చోప్రా (35), ధ్రువ్ (20) తప్ప మరెవరూ రాణించలేదు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రీది, అబ్రార్, రౌఫ్‌లు తలో 2 వికెట్లు తీశారు.

మరోవైపు, ఒకవేళ యూఏఈతో మ్యాచ్‌ను పాక్ బాయ్‌కాట్ చేసి ఉంటే, ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. సుమారు రూ.145 కోట్ల ఆదాయం కోల్పోవడంతో పాటు, క్రమశిక్షణా ఉల్లంఘన చర్యల కింద మరో రూ.140 కోట్లను ఐసీసీకి చెల్లించాల్సి ఉండేది. అంటే మొత్తంగా రూ.285 కోట్ల భారం మోయాల్సి వచ్చేది. చివరకు పాక్ తలొగ్గి మ్యాచ్ ఆడటానికి అంగీకరించడంతో పోరు సజావుగా జరిగింది.

Leave a Reply