79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా సామాన్యులకు ఊరట కలిగించే సంచలన ప్రకటన చేశారు. రాబోయే దీపావళి పర్వదినం నుంచి ప్రజలపై జీఎస్టీ భారం తగ్గించేందుకు కొత్త సంస్కరణలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు (MSME) భారీ ప్రయోజనం కలిగించనుంది. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా, కేంద్రం మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు వెళ్తోంది – నిర్మాణాత్మక మార్పులు, రేట్ల హేతుబద్ధీకరణ, సామాన్యుల ఆర్థిక స్థితి మెరుగుదల.
ప్రస్తుతం అమలులో ఉన్న 5%, 12%, 18%, 28% జీఎస్టీ స్లాబ్‌ల స్థానంలో ఇకపై కేవలం రెండు స్లాబ్‌లు మాత్రమే ఉండనున్నాయి. అందులో ఒకటి స్టాండర్డ్ స్లాబ్, మరొకటి మెరిట్ స్లాబ్. ఎంపిక చేసిన కొన్ని వస్తువులపై మాత్రమే ప్రత్యేక రేట్లు అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.
ఈ సంస్కరణలు మహిళలు, విద్యార్థులు, రైతులు, మధ్యతరగతి సహా సమాజంలోని అన్ని వర్గాలకు లాభం చేకూరుస్తాయని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం ప్రతిపాదనలు జీఎస్టీ కౌన్సిల్‌పై ఏర్పాటు చేసిన సెంట్రల్ కేబినెట్ సబ్ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. రేట్ల స్థిరత్వం, వర్గీకరణ వివాదాల తగ్గింపు, వ్యాపార అవకాశాల పెంపు వంటి అంశాలపై కమిటీ దృష్టి సారించనుంది.
ఈ మార్పులతో కీలక ఆర్థిక రంగాలను బలోపేతం చేసి, దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే కేంద్రం లక్ష్యం. వచ్చే నెల జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ సంస్కరణలకు ఆమోదం లభించే అవకాశం ఉంది.