GST 2.0 : వినియోగదారులకు శుభవార్త.. జీఎస్టీ 2.0తో తగ్గిన ధరలివే!

జీఎస్టీ 2.0 అమలుతో నేటి నుంచి కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన 56వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లలో కీలక మార్పులు జరిగాయి. ముఖ్యంగా 12%, 28% పన్ను స్లాబ్‌లను రద్దు చేసి, ఇకపై 5% మరియు 18% మాత్రమే అమలులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

తగ్గిన ధరల జాబితా
నిత్యావసర వస్తువులైన వెన్న, నెయ్యి, పన్నీర్, వంట నూనెలు, ప్యాకేజ్డ్ గోధుమ పిండి, సబ్బులు వంటి వాటి ధరలు తగ్గాయి. అలాగే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వస్తువులపై కూడా ధరలు పడిపోయాయి. ఇందులో ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్లు, టెలివిజన్‌లు, రూ. 25,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఆటోమొబైల్స్ రంగంలోనూ ప్రభావం పడింది. మారుతి సుజుకి కొన్ని మోడళ్ల కార్లు, 350సీసీ లోపు టూ-వీలర్‌లు తక్కువ ధరల్లో లభ్యమవుతున్నాయి.

చిన్నారుల నాప్కిన్లు, ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలు, బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రింట్స్ ధరలు కూడా తగ్గాయి. విద్యార్థులకు అవసరమైన ఎక్సర్సైజ్ పుస్తకాలు, పెన్సిల్స్, నోట్‌బుక్స్‌పై జీఎస్టీ పూర్తిగా రద్దు చేశారు. ఇకపై వీటిపై 0% పన్ను ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంలపై కూడా జీఎస్టీ మాఫీ ఇచ్చారు.

పెరిగిన ధరల జాబితా
పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు, సిగరెట్లపై పన్ను 28% నుంచి 40%కి పెరిగింది. అలాగే కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ పానీయాలు, ఫ్రూట్ ఫిజ్జీ డ్రింక్స్ ధరలు పెరిగాయి. లగ్జరీ కార్లు, భారీ బైకులు, ప్రైవేట్ విమానాలు, రివాల్వర్లు, పిస్టల్స్‌లపై పన్ను 40%కి పెంచారు. బొగ్గు, లిగ్నైట్‌పై పన్ను 5% నుంచి 18%కి పెరిగింది. బయోడీజిల్‌పై పన్ను 12% నుంచి 18%కి పెరిగింది. రూ. 2,500 కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం వస్త్రాలు, టెక్స్టైల్, హై-వాల్యూ కాటన్ దుప్పట్లపై 18% పన్ను అమలులోకి వచ్చింది.

Leave a Reply