సీపీఐ అగ్ర నాయకులు, మాజీ జాతీయ కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తుదిశ్వాస విడిచారు.
రాజకీయ ప్రస్థానం
సురవరం సుధాకర్ రెడ్డి 1998, 2004లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు. అనంతరం 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. మానవ వనరుల అభివృద్ధి కమిటీ, ఔషధ ధర నియంత్రణ ఉపకమిటీ, ప్రభుత్వ సలహా కార్యవర్గం, ఆర్థిక మంత్రిత్వ శాఖలలో కూడా సభ్యునిగా పనిచేశారు.
వ్యక్తిగత జీవితం
1942 మార్చి 25న మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో జన్మించిన సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుండి బీఏ, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.