2019 డిసెంబర్‌లో చైనాలో తొలిసారిగా గుర్తించబడిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కోట్లాది మంది దీనితో బాధపడి, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా 2021లో వచ్చిన సెకండ్ వేవ్ ఎంతటి ప్రాణనష్టం కలిగించిందో ఇంకా మరిచిపోలేము. ఇప్పటికీ కరోనా పూర్తిగా అంతమవ్వకపోయినా, దాని ప్రభావం మాత్రం గణనీయంగా తగ్గింది. కొత్త వేరియంట్లు వస్తున్నప్పటికీ, అవి పెద్దగా ప్రమాదం కలిగించడంలేదు.
కరోనా వ్యాప్తి పెరిగిన సమయంలో టీకాలు (వ్యాక్సిన్లు) అత్యవసరంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వ్యాక్సిన్ డోసులు వేశారు. వైద్యుల సూచనలతో చాలామంది రెండు డోసులు తీసుకోగా, కొంతమంది బూస్టర్ డోసులూ తీసుకున్నారు.
అయితే ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వంటి అకస్మాత్తు మరణాలు పెరగడం వల్ల, కొందరు దీనికి వ్యాక్సిన్లను కారణంగా పేర్కొన్నారు. కానీ వైద్య నిపుణులు ఇది పూర్తిగా నిరాకరించారు. వ్యాక్సిన్ల వల్ల కాదు, ఇతర ఆరోగ్య సమస్యల వల్లే అలాంటి మరణాలు జరిగాయని స్పష్టం చేశారు.
తాజాగా మరో విశ్వసనీయ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. 2020 నుంచి 2024 మధ్య కాలంలో కరోనా వ్యాక్సిన్‌ల కారణంగా దాదాపు 25.33 లక్షల మంది ప్రాణాలతో బయటపడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వివరాలను సైన్స్ డైలీ నివేదికలో పేర్కొన్నారు. ఇటలీలోని యూనివర్సిటా కాటోలికా, అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.
ఈ అధ్యయనం ప్రకారం, ప్రతి 5400 టీకాల వల్ల ఒక మరణాన్ని అరికట్టినట్లు తేలింది. ఈ రిపోర్ట్‌ను JAMA హెల్త్ ఫోరం అనే ప్రముఖ వైద్య జర్నల్‌లో ప్రచురించారు. అంతేకాదు, వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కొంతమంది మరణించిన ఘటనలు ఉన్నా, టీకాల వల్ల మరణాల తీవ్రత గణనీయంగా తగ్గినట్లు కూడా వెల్లడించారు.
ప్రస్తుతం కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉన్నా, పలు దేశాల్లో కేసులు మళ్లీ పెరుగుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయినా, మందుల సహాయంతో అవి త్వరగా నయం అవుతున్నాయి. గతంలో వ్యాక్సిన్ తప్పనిసరి కాదని భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, కొంతమంది తీసుకోవడంలో ఆసక్తి చూపలేదు.
లాక్‌డౌన్ సమయంలో ఎదురైన కష్టాల్ని మరచిపోలేం. కానీ వ్యాక్సిన్ వల్ల లక్షలాది ప్రాణాలు కాపాడబడ్డాయన్న విషయాన్ని ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపించారు.