MP Sudha Ramakrishnan: ఢిల్లీ హై సెక్యూరిటీ జోన్‌లో ఎంపీ మెడలో చైన్ లాకెళ్లిన దొంగలు!

తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ పై ఢిల్లీ చాణిక్యపురిలో జరిగిన దొంగతనం కలకలం రేపుతోంది. అత్యంత భద్రత కలిగిన విదేశీ రాయబారుల నివాస ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.

వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 4, సోమవారం ఉదయం 6:15 గంటల సమయంలో ఎంపీ సుధా రామకృష్ణన్ మరో ఎంపీ రజినీతో కలిసి వాకింగ్ చేస్తుండగా, స్కూటీపై వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఈ సంఘటనలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. దొంగ ముఖానికి మాస్క్ మరియు హెల్మెట్ ధరించి ఉండడంతో గుర్తించలేకపోయారు.

సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దొంగను పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది.

ఈ ఘటనపై ఎంపీ సుధా రామకృష్ణన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌కు లేఖ రాశారు. తనపై జరిగిన దాడిని వివరిస్తూ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఢిల్లీ పోలాండ్ ఎంబసీ గేట్ సమీపంలో ఉన్న హై సెక్యూరిటీ జోన్‌లో ఈ దాడి జరగడం నిజంగా దిగ్భ్రాంతికరం. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది,” అని ఆమె పేర్కొన్నారు.

చైన్ లాగే సమయంలో తల, మెడ భాగంలో స్వల్పంగా గాయమైందని, దాదాపు నాలుగు సవర్ల బంగారు గొలుసు పోయిందని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేయాలని, ఢిల్లీలో భద్రతను మెరుగుపరచాలని హోంమంత్రిని కోరారు.

ఈ ఘటనతో ఢిల్లీ భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశ రాజధానిలోని అత్యంత రక్షణ కలిగిన ప్రాంతంలో ఓ ఎంపీకి ఈ పరిస్థితి ఎదురైతే, సాధారణ పౌరుల పరిస్థితి ఏంటన్నది ప్రధాన చర్చగా మారింది.

Leave a Reply