Caste Census: కులగణనపై కేంద్ర కీలక నిర్ణయం.. రెండు దశలుగా చేపట్టనున్న కేంద్రం

భారతదేశంలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 మార్చి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రక్రియను రెండు దశలుగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. జనగణనతోపాటు కులగణనను కూడా నిర్వహించాలని నిశ్చయించుకుంది.

ఈ క్రమంలో 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి మొదటి దశ ప్రారంభమవుతుంది. ఈ దశలో జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో కులగణన చేపట్టనున్నారు. రెండో దశగా 2027 మార్చి 1వ తేదీ నుంచి మిగతా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఏప్రిల్ 30న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ప్రధాన జనగణనలోనే కులగణన
ఇప్పటివరకు కులగణనను ప్రత్యేక సర్వేగా చేపట్టాలని డిమాండ్లు వచ్చినప్పటికీ, ఈసారి దాన్ని ప్రధాన జనాభా లెక్కల్లో భాగంగా నిర్వహించనున్నారు. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు నిర్వహించే భారత ప్రభుత్వం, చివరిసారి 2011లో ఈ ప్రక్రియను చేపట్టింది. అయితే 2021లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో, కేంద్రం తాజా నిర్ణయం కీలకమైంది. గత కొన్ని సంవత్సరాలుగా విపక్షాలు కులగణన కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ కులగణనతో సామాజిక న్యాయం, రిజర్వేషన్లు వంటి అంశాల్లో సమర్థవంతమైన విధానాలను రూపుదిద్దేందుకు దోహదపడనుందని విశ్లేషకుల అభిప్రాయం.

చరిత్రలో మొదటి గణన 1872లో
భారతదేశంలో మొదటి జనాభా గణన 1872లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకూ ఒకసారి ఇది జరుగుతూ వస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో 2026-27లో జరగబోయే కులగణన, దేశ రాజకీయాల్లో కీలక మలుపుని సూచించనుంది.

Leave a Reply