బాంబే హైకోర్టు విడాకులకు సంబంధించి సంచలన తీర్పు ఇచ్చింది. భర్తతో శృంగారానికి భార్య నిరాకరించడం, భర్తకు వివాహేతర సంబంధాలున్నాయనే అనుమానం వ్యక్తం చేయడం క్రూరత్వంతో సమానం అని పేర్కొంది. ఇవి విడాకుల కారణాలుగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది.
ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఓ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
2013లో ఈ జంటకు వివాహం జరిగింది. కానీ, పెళ్లి తర్వాత ఏడాదిలోనే ఆమె భర్తతో విడిగా జీవిస్తోంది. శృంగారానికి నిరాకరించడం, భర్తకు వివాహేతర సంబంధాలున్నాయనే అనుమానం పెట్టి వేధించడం, కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందు అవమానించడం వంటి ఆరోపణలు భర్త వేశారు.
తన ప్రవర్తన వల్ల తీవ్ర ఆవేదనకు గురవుతున్నానని, ఇక కలసి జీవించడం సాధ్యం కాదని చెప్పి 2015లో పుణెలో ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశాడు. కోర్టు భర్త పక్షాన తీర్పు ఇచ్చింది.
దీన్ని సవాలు చేస్తూ భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అలాగే నెలకు లక్ష రూపాయల భరణం చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేసింది.
విచారణలో భాగంగా హైకోర్టు, ఆమె భర్తతో, అతడి దివ్యాంగ సోదరితో, కుటుంబ సభ్యులతో ఆమె ప్రవర్తన దారుణంగా ఉందని పేర్కొంది. భర్తపై అనుమానాలు, శృంగారానికి నిరాకరణ, కుటుంబ పట్ల అసభ్య ప్రవర్తన – ఇవన్నీ భర్త మానసిక వేదనకు కారణమని గుర్తించింది.
అందువల్ల ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును హైకోర్టు కూడా సమర్ధించింది.