బిహార్ ప్రస్తుతం గూండాల రాజ్యంగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం నేరాలను అణచడంలో విఫలమైందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్య నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్‌లో ప్రజలు దోపిడీ, కాల్పులు, హత్యల భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాహుల్ అన్నారు. నేరాలు ఇప్పుడు సాధారణమైపోయాయన్న ఆయన, ‘‘ఇలాంటివి జరగకుండా చూడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’’ అంటూ నితీష్‌పై విమర్శల వర్షం కురిపించారు.
ప్రజల రక్షణ చేయలేని పార్టీకి ఓటు ఎందుకు వేయాలంటూ బిహార్ ప్రజలను రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని శాంతియుతంగా, నేరరహితంగా మార్చే బాధ్యత ప్రజలదేనని పేర్కొన్నారు.
ఇక గోపాల్ ఖేమ్కా హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. శుక్రవారం రాత్రి 11.40కి పట్నాలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో ఖేమ్కా ఇంటి ఎదుట కారు దిగుతుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ దుర్వినియోగంపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఈ హత్యపై నిప్పులు చెరిగారు. నడిబొడ్డున జరిగిన ఈ దాడికి పోలీసులు స్పందించేందుకు రెండు గంటల సమయం తీసుకున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, ఖేమ్కా కుమారుడిని 6 ఏళ్ల క్రితమే హత్య చేసినా.. ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని ఆరోపించారు.