Nitish Kumar: బిగ్ అనౌన్స్‌మెంట్.. బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన!

బీహార్‌ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ గురువారం ఓ సంచలన నిర్ణయం ప్రకటించారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి గృహ వినియోగదారులకు మొదటి 125 యూనిట్ల విద్యుత్తుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరని స్పష్టం చేశారు. దీని వలన రాష్ట్రంలోని సుమారు 1.67 కోట్ల కుటుంబాలకు నేరుగా లాభం కలుగుతుందని నితీష్ చెప్పారు.

పేదలకు సౌర విద్యుత్ పథకం
కుతిర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించనుంది. మిగతా గృహ వినియోగదారులకు కూడా సబ్సిడీ రూపంలో తగిన మద్దతు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో 125 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం పూర్తిగా ఉచితంగా మారనుంది. అంతేకాదు, రాబోయే మూడు సంవత్సరాల్లో 10,000 మెగావాట్ల సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

సీఎం నితీష్ కుమార్‌ సంచలన హామీలు
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నితీష్ కుమార్ వరుస హామీలు ఇస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్‌ను అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అలాగే వచ్చే ఐదేళ్లలో ఒక కోటి కొత్త ఉద్యోగాలు సృష్టించడమే తమ లక్ష్యమని చెప్పారు. బీహార్‌లో ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Leave a Reply