PM Modi: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటన

బెంగళూరులో జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ఆయన “పూర్తిగా హృదయ విదారకమైనది”గా అభివర్ణించారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సాయం) ప్రకటించింది.

సన్మాన వేడుకలో విషాదం
ఐపీఎల్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం ఆర్‌సిబి జట్టును సత్కరించేందుకు అహ్మదాబాద్‌లోని ఘన విజయానంతరం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. అయితే బుధవారం ఈ కార్యక్రమం సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. స్టేడియం వెలుపల అనూహ్య రీతిలో గుమికూడడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో అనేక మంది గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు
ఈ విషాద ఘటనకు సంబంధించి కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. సరైన సన్నాహాలు లేకపోవడం, భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ తొక్కిసలాటకు కారణమని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.

Leave a Reply