Prayagraj Flood: పీకల్లోతు వరదలో బాహుబలి సీన్.. నెట్టింట కంటతడి తెప్పించిన వీడియో!

గత రెండు మూడు వారాలుగా దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రాంతాల్లో గంగా, యమునా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తూ, భారీగా నీటిమట్టం పెరగడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వారణాసిలో సుమారు 80 ఘాట్లు పూర్తిగా నీటిలో మునిగిపోవడం, ప్రయాగ్‌రాజ్‌లో అనేక కాలనీలు వరద నీటితో నిండిపోవడం వంటి దృశ్యాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ప్రజలు పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. విద్యుత్, తాగునీటి సమస్యలు భగ్గుమంటున్నాయి. ఇళ్లను వదిలి వేలాది మంది నిరాశ్రయులవుతుండగా, ఆహారం, నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఈ నేపథ్యంలో, ఒక దంపతులు తమ నవజాత శిశువును పైకి ఎత్తుకుని, పొట్ట నిండిన వరద నీటిలో నడుస్తూ హాస్పిటల్‌కు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. అనారోగ్యంతో ఉన్న శిశువును సురక్షితంగా తీసుకెళ్లడానికి ఎలాంటి సహాయం లేకుండా వారు చేసిన ప్రయత్నం, ‘బాహుబలి’లో శివగామి సన్నివేశాన్ని తలపించిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ దృశ్యం ప్రభుత్వం విఫలతను స్పష్టంగా చూపుతోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కోట్ల రూపాయలు ఉత్సవాల కోసం ఖర్చు చేసే యోగి ప్రభుత్వం, సాధారణ ప్రజల రక్షణ విషయంలో తలదించుకునేలా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు.

Leave a Reply