Anurag Thakur: కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు..!

బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఉన జిల్లాలో ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయలో జరిగిన జాతీయ రోదసీ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన..

“అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తి ఎవరు?” అని ప్రశ్నించారు. కొందరు విద్యార్థులు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అని సమాధానమిచ్చారు. అయితే, అనురాగ్ ఠాకూర్ “నేను ఆంజనేయుడని అనుకుంటున్నాను. లంకకు వెళ్లేందుకు హనుమంతుడు ఎగిరిపోయాడు కాబట్టి ఆయనే తొలి అంతరిక్ష యాత్రికుడు” అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు బహిరంగంగా రావడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. శాస్త్రీయంగా అంతరిక్షానికి వెళ్లిన తొలి వ్యక్తి సోవియట్ వ్యోమగామి యూరీ గగారిన్ (1961) అని వాస్తవం. అయితే, హనుమంతుడిని తొలి వ్యోమగామిగా పేర్కొనడం విద్యావేత్తలు, విమర్శకుల ఆగ్రహాన్ని రేపింది.

డీఎంకే ఎంపీ కనిమొళి కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. శాస్త్రాన్ని పక్కన పెట్టి పురాణాలను వాస్తవాలుగా చూపించడం పిల్లల్లో తప్పుడు అవగాహన కలిగిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A (H) ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం పౌరుల కర్తవ్యమని నిపుణులు గుర్తు చేశారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనూ అనురాగ్ ఠాకూర్ చేసిన “దేశ ద్రోహులను కాల్చిపారేయండి” వ్యాఖ్యలతో భారీ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

Leave a Reply