Anant Ambani: అనంత్ అంబానీ పాదయాత్ర.. సంకల్పంతో 140 కిలోమీటర్ల ప్రయాణం!

భారతదేశపు అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ తనయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తిశ్రద్ధలతో పాదయాత్ర ప్రారంభించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకాధీష్ ఆలయం వరకు ఈ 140 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేయాలని ఆయన సంకల్పించారు.

ఈ తెల్లవారు జామున జామ్‌నగర్‌లోని మోతీ ఖావ్డీ నివాసం నుంచి భారీ భద్రత మధ్య పాదయాత్రగా బయలుదేరిన అనంత్, రోజుకు 10-12 కిలోమీటర్లు నడుస్తూ, నాలుగు నుంచి అయిదు రోజుల్లో ద్వారకా చేరుకోవాలని భావిస్తున్నారు. ఆదివారం నాటికి ఆయన ద్వారకా ఆలయానికి చేరుకునే అవకాశం ఉంది.

ఈ నెల 10న అనంత్ అంబానీ 30వ పుట్టినరోజు. పెళ్లి తరువాత జరుపుకుంటున్న మొట్టమొదటి బర్త్‌డే ఇది. అందుకే ఈ ప్రత్యేక సందర్భాన్ని శ్రీకృష్ణుడి దర్శనంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

జెడ్ ప్లస్ భద్రతా కేటగిరీకి చెందిన అనంత్ అంబానీ కోసం స్థానిక పోలీసులు, ప్రత్యేక బృందాలు భారీ భద్రతను ఏర్పాటు చేశాయి. జామ్‌నగర్ నుంచి ద్వారకా వరకు ప్రత్యేక సెక్యూరిటీ కారిడార్ ఏర్పాటుచేసి ఆయన పాదయాత్రను సమర్థంగా నిర్వహిస్తున్నారు.

అనంత్ అంబానీ పాదయాత్రలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రియుడు, అతని సన్నిహిత మిత్రుడు శిఖర్ పహారియా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా, రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు వంతారా వైల్డ్ యానిమల్స్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఉద్యోగులు కూడా ఆయన వెంట ఉన్నారు.

ఈ ప్రత్యేక పాదయాత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆధ్యాత్మికతను ప్రశంసిస్తున్నారు.

Leave a Reply