Air India Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం పై ఏఏఐబీ నివేదిక.. ఇంజిన్లు ఆగిపోవడం వల్లే ఘోరం

కొన్ని రోజుల క్రితం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడంతో ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 240 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది సహా మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తాజాగా ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు ఆగిపోవడం వల్ల ఇంజిన్లు పనిచేయకపోవడం ప్రమాదానికి కారణమని తేల్చింది.

ఇంజిన్ల కటాఫ్.. పైలెట్ల మధ్య సంభాషణలో నిజాలు బయటకు

15 పేజీల నివేదికలో AAIB ఇచ్చిన వివరాల ప్రకారం, రెండు ఇంజిన్లు ఒకేసారి ఆగిపోయినట్లు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ద్వారా గుర్తించారు. “ఇంజిన్లను నువ్వే ఆఫ్ చేశావా?” అని ఒక పైలెట్ అడగగా, మరో పైలెట్ “నేను స్విచ్ఆఫ్ చేయలేదు” అని సమాధానమిచ్చాడని నివేదికలో వెల్లడించారు. అనంతరం మేడే కాల్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఒక ఇంజిన్ పునరుద్ధరణ.. కానీ రెండోది ఫెయిల్

ఇంజిన్లు ఆగిన తర్వాత కూడా విమానం కొంత మేరకు ఎత్తుకు ఎగరగలిగిందని నివేదిక చెబుతోంది. పైలెట్లు వెంటనే చర్యలు తీసుకుని ఒక ఇంజిన్‌ను మళ్లీ ప్రారంభించగలిగారు. కానీ రెండో ఇంజిన్‌ను మాత్రం తిరిగి ఆన్ చేయలేకపోయారు.

ఏటీసీ స్పందించినా ప్రయోజనం లేకుండా పోయింది

మేడే కాల్ వచ్చిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినా, అప్పటికే పరిస్థితి నియంత్రణకు బయటకి వెళ్లిపోయిందని AAIB తెలిపింది. విమానం నుంచి తిరిగి ఎలాంటి స్పందన రాలేదని, పరిస్థితి చాలా వేగంగా దిగజారిందని పేర్కొంది.

ఇంజిన్లను భద్రపరిచిన అధికారులు

ప్రమాద అనంతరం రెండు ఇంజిన్లను వెలికితీసి, తదుపరి ఫోరెన్సిక్ పరిశోధన కోసం భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. విమానానికి సంబంధించి బరువు, ఇంధన పరిమితులు సాధారణంగా ఉన్నట్లు స్పష్టమైంది. ప్రమాదానికి ముందు విమానంలో ఎలాంటి ప్రమాదకర వస్తువులూ లేవని నివేదిక స్పష్టం చేసింది.

Leave a Reply