Addanki Dayakar: మోడీ, అమిత్ షాలు దొంగలు, కేడీలు.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు..!

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోడీ, అమిత్ షాలపై ఆయన చేసిన విమర్శలు రాజకీయంగా పెను దుమారం రేపాయి.

“ఏయ్ మోడీ… బ్రిటిష్ వారికే భయపడని పార్టీ మాదిరా! మోడీ, అమిత్ షాలు దరిద్రులు, కేడీలు, దొంగలు. మోడీకి స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర ఏముంది? దేశాన్ని చీల్చి పాలించే నేత కాదు మేము. మేమే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాం. 2029లో మోడీని జైలుకి పంపించే రోజు వస్తుంది” అని దయాకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలు ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర స్పందనను కలిగిస్తున్నాయి.

దయాకర్ మాట్లాడుతూ… ‘‘రాహుల్ గాంధీ, సోనియా గాంధీ త్యాగానికి చిహ్నాలు. వారికి సొంత ఇల్లు లేకపోయినా దేశానికి సేవ చేస్తున్నారు. అలాంటి వారికి టార్గెట్ చేస్తూ కుట్రలు చేయడం రాజకీయ కక్షలు తప్ప మరొకటి కాదు. దేశం మొత్తంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కటవుతున్నారు. ప్రజాస్వామ్యంపై జరిగే దాడులను తిప్పికొట్టే బాధ్యత ప్రజలదే’’ అన్నారు. కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని మేల్కొలిపే శక్తిగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీజేపీ విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తుంటే, రాహుల్ గాంధీ ప్రేమ, ఐక్యతను పంచుతున్నారని దయాకర్ అన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ మోస్తుందనీ, ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై ఈడీ, ఐటీ దాడులు చేయడం మోడీ పాలనలో నిత్యంలా మారిందన్నారు. “ఇప్పటి వరకు జరిగిన అన్ని కుట్రలకు ప్రజలే జవాబు చెబుతారు. మోడీని పాతాళంలోకి తొక్కించే రోజు దూరంలో లేదు,” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply