హోటల్‌కు రమ్మన్నాడంటూ నటి సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ లీడర్ రాజీనామా!

కేరళకు చెందిన యువ కాంగ్రెస్ నేతపై మలయాళ నటి రిని ఆన్ జార్జ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు అసభ్యకరమైన మెసేజులు పంపి, హోటల్‌కు రావాలని పదేపదే వేధించాడని ఆమె ఆరోపించింది. గత మూడేళ్లుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని, తాను మాత్రమే కాక మరికొంత మంది మహిళలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె తెలిపారు. అయితే తనపై నేరుగా ఎలాంటి దాడి జరగలేదని, కానీ బాధితుల తరఫున మాట్లాడుతున్నానని రిని ఆన్ జార్జ్ స్పష్టం చేశారు.

ఈ ఆరోపణలు కేరళ రాజకీయాల్లో కలకలం రేపాయి. రిని ఆన్ జార్జ్ ఎవరిపేరు చెప్పకపోయినా, బీజేపీ కార్యకర్తలు పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటతిల్‌పై నిరసనలు చేపట్టారు. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రాహుల్ మమ్కూటతిల్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే రిని ఆన్ జార్జ్ ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

ఫిర్యాదు చేయకపోవడానికి కారణం
న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకపోవడం, భద్రతా కారణాల వల్లనే తాను ఫిర్యాదు చేయలేదని రిని ఆన్ జార్జ్ తెలిపారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడిన తర్వాత, మరికొంత మంది మహిళలు కూడా తమ అనుభవాలను ఆమెకు చెప్పినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఆమెపై సైబర్ దాడులు జరుగుతున్నాయని కూడా తెలిపారు.

వేధింపులు కొనసాగితే ఆ నేత పేరును బయటపెడతానని రిని ఆన్ జార్జ్ హెచ్చరించారు. రిని ఒక మలయాళ నటి మాత్రమే కాక, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ చేశారు. ఇటీవల విడుదలైన 916 కుంజూట్టన్ అనే మలయాళ సినిమాలో ఆమె నటించారు.

Leave a Reply