అమెరికాలో భారతీయ గ్రీన్ కార్డు హోల్డర్లపై నిఘా పెరుగుతోంది. వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా గ్రీన్ కార్డు దారులను లక్ష్యంగా చేసుకుని కఠిన చర్యలు ప్రారంభించింది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనతో గ్రీన్ కార్డు హోల్డర్ల భద్రతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రోజు నుంచి భారతీయ గ్రీన్ కార్డు హోల్డర్లపై విమానాశ్రయాల్లో కఠిన తనిఖీలు ప్రారంభమయ్యాయి. వీరిని కస్టడీలోకి తీసుకుని విచారణలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాస హక్కు ఉండదని అమెరికా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడంతో భారతీయ వలసదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తూ విమానాశ్రయాల్లో గ్రీన్ కార్డు హోల్డర్లను నిలిపివేసి, వారి భారత పర్యటనలు, విదేశాల్లో గడిపిన కాలం గురించి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, వారికి ఫార్మ్ I-407 పత్రంపై సంతకం చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫ్లోరిడాకు చెందిన ఇమ్మిగ్రేషన్ న్యాయవాది అశ్విన్ శర్మ ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. సియాటిల్‌కు చెందిన న్యాయవాది కృపా ఉపాధ్యాయ్ కూడా గ్రీన్ కార్డు హోల్డర్లు ఫార్మ్ I-407పై బలవంతంగా సంతకం చేయరాదని హెచ్చరించారు. ఒకవేళ వారు ఆ పత్రంపై సంతకం చేస్తే, తమ గ్రీన్ కార్డు హోదాను కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు.
“అమెరికా ఫస్ట్” విధానాన్ని దూకుడుగా అమలు చేస్తున్న ట్రంప్, గ్రీన్ కార్డు హోల్డర్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు సురక్షితంగా ఉన్నామని భావించిన భారతీయ వలసదారులు ఈ పరిణామాలతో భయాందోళనలకు గురవుతున్నారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం, గ్రీన్ కార్డు హోల్డర్లు కొన్ని కారణాల వల్ల తమ హోదాను కోల్పోవచ్చు. ముఖ్యంగా, అమెరికా వెలుపల ఎక్కువ కాలం గడపడం ప్రధాన కారణంగా మారుతోంది. ఒక వ్యక్తి 6 నెలలకుపైగా విదేశాల్లో ఉంటే ఆయనపై ఇమ్మిగ్రేషన్ అధికారులకు విచారణ చేయడానికి హక్కు ఉంది. అదే 1 సంవత్సరంపాటు అమెరికా వెలుపల గడిపితే, అతని గ్రీన్ కార్డు హోదా స్వయంచాలకంగా రద్దవుతుంది.
ఇంకా, జాతీయ భద్రతా కారణాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అనుమానాలు, వీసా మోసం, ఇతర ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలు గ్రీన్ కార్డు రద్దుకు దారి తీసే ఇతర ముఖ్య కారణాలు.
ప్రస్తుతం ఉద్యోగాధారిత గ్రీన్ కార్డు బ్యాక్లాగ్లోనే 10 లక్షలకు పైగా భారతీయులు ఎదురు చూస్తున్నారు. తాజా తనిఖీలు, నిర్బంధాలు గ్రీన్ కార్డు ఉన్న భారతీయుల్లో మరింత భయాన్ని పెంచాయి. ఇప్పటివరకు అమెరికాలో గ్రీన్ కార్డు ఉంటే చాలు, భవిష్యత్తు భద్రమని భావించిన వారు, ఇప్పుడు స్వదేశానికి తిరిగి వెళ్లాలా? లేదా? అనే ప్రశ్నతో తీవ్ర సంక్షోభంలో ఉన్నారు.