Donald Trump: భారత విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్..

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పాలనలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులపై కూడా ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే వీసా నిబంధనలు పాటించని వేలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే కాకుండా, వారి లీగల్ స్టేటస్‌ను కూడా తొలగించారు.

తాజాగా భారత విద్యార్థులకు ట్రంప్ పాలనలో మరోసారి తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యా వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే కచ్చితంగా వీసా రద్దు అవుతుందని హెచ్చరించారు. ప్రతిరోజూ క్లాసులకు హాజరుకాకపోవడం, కోర్సును మధ్యలోనే వదిలేయడం లేదా యూనివర్సిటీకి ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా డ్రాపౌట్ కావడం వీసా రద్దుకు దారితీస్తాయని స్పష్టం చేశారు. అంతే కాకుండా, ఇలా జరిగితే భవిష్యత్తులో H-1B వీసాలు, గ్రీన్ కార్డ్‌లు, టూరిస్ట్ వీసాలు పొందే అవకాశం కూడా పోతుందని అమెరికాలోని ఎంబసీ భారత విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది.

వీసా నిబంధనలు పాటించకపోతే కేవలం వీసా రద్దే కాకుండా, విద్యార్థి స్టేటస్ కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అమెరికాలో చదువుకునే విద్యార్థులు తప్పనిసరిగా వీసా నిబంధనల ప్రకారం స్టేటస్‌ను కాపాడుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల SEVIS డేటాబేస్ ప్రకారం ఏప్రిల్ 10 వరకు 4,736 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసా రికార్డులు రద్దయ్యాయి. అమెరికాలోని 187 కాలేజీలు, యూనివర్సిటీల్లో 1,222 మంది విద్యార్థులు తమ విద్యార్థి హోదాను కోల్పోయారు. ఇందులో ఎక్కువ మంది భారత విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply