Trump: ట్రంప్ సంచలనం: 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. అమెరికాలో భద్రతా అలర్ట్

ఇటీవల అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో జరిగిన పాలస్తీన్ మద్దతుదారుల దాడి అనంతరం, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన దేశ భద్రతపై ప్రభావం చూపించవచ్చని భావించి 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసి ఆదేశాలు జారీ చేశారు.

ఈ నిషేధం అమలులో ఉన్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, కాంగో రిపబ్లిక్, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ ఉన్నాయని సమాచారం. అదేవిధంగా బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా దేశాలకు పాక్షిక ఆంక్షలు పెట్టారు.

“మాకు భద్రతాపరంగా ముప్పు కలిగించే దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించం. మా ప్రజల రక్షణే ప్రాధాన్యం,” అని ట్రంప్ స్పష్టం చేశారు. “అమెరికన్ ప్రజలను హాని నుంచి రక్షించేందుకు ట్రంప్ తన ఎన్నికల హామీని నిలబెట్టుకుంటున్నారు,” అని వైట్ హౌస్ ప్రతినిధి అబిగెయిల్ జాక్సన్ ట్వీట్ చేశారు.

ఇదే ట్రంప్ తొలి ట్రావెల్ బ్యాన్ కాదు. ఆయన 2017లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇరాక్, సిరియా, యెమెన్, లిబియా లాంటి ముస్లిం మెజారిటీ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అయితే 2021లో అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు. ఇప్పుడు తాజా పరిణామాలతో ట్రంప్ మళ్లీ అదే పాత మార్గాన్ని ఎంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply