జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. “ఢిల్లీని చూస్తే కాలుష్యం వల్ల నగర జీవితం ఎలా అతలాకుతలమవుతుందో తెలుస్తోంది. అలాంటి పరిస్థితులను మన రాష్ట్రం చవిచూడకూడదని మూసీ నది శుద్ధిపై నేను అంతగా ప్రాధాన్యం ఇస్తున్నాను” అని తెలిపారు.
అభివృద్ధి దిశగా కీలక ప్రాజెక్టులు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో మెరుగైన పురోగతిని సాధించిందని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అలాగే మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని చెప్పారు.
మూసీ నది ప్రక్షాళనకు ప్రాధాన్యత
టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ మాదిరిగానే మూసీ నదిని శుద్ధి చేసి, అభివృద్ధి చేయాలని ప్రభుత్వ దృష్టి ఉందని తెలిపారు. అయితే కొందరు ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఢిల్లీ వంటి స్థితి హైదరాబాద్‌కు రావద్దంటే, ఇప్పుడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అన్నారు.
పెట్టుబడులు – ఉపాధి లక్ష్యం
రాష్ట్రంలో పెట్టుబడులు పెంచడం, పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. “తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం. మీకు చేతనైనంతగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తోడ్పడండి. సొంత ఊరిని అభివృద్ధి చేయడంలో ఉండే ఆనందం ప్రత్యేకమైనది” అంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.