Pakistan Train Hijack: జాఫర్ ట్రైన్ హైజాక్: పాక్ ఆర్మీ ప్రతాపం – క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్టులు..!

పాకిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదులు హైజాక్‌ చేసిన రైలును పాక్ ఆర్మీ ఆపరేషన్ తో ట్రైన్ లో వున్న ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకుండా విడిపించుకున్నారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్‌ చేశారు. అయితే పాకిస్థాన్‌ లో రైలు హైజాక్‌ అయిన ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతో పాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతిచెందినట్లు పాక్‌ ఆర్మీ జనరల్‌ పేర్కొన్నారు. పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని.. ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసిందని ఆర్మీ అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ తెలిపారు.

జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో దాదాపు 450 మంది ప్రయాణికులు తమ అదుపులో ఉన్నారని.. మిలటరీ ఆపరేషన్ చేసేందుకు యత్నిస్తే అందరినీ హతమారుస్తామని కూడా హెచ్చరించింది. హైజాక్ అయిన రైల్లోని తొమ్మిది బోగీల్లో దాదాపు 400 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో బలూచ్ వేర్పాటువాదులు చిన్న టీమ్‌లుగా విడిపోయారు. ఈ క్రమంలోనే తమ ఆపరేషన్ కష్టతరంగా మారిందని పాక్ భద్రత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బలూచ్ రెబల్స్ అఫ్గానిస్థాన్‌లో ఉన్న వారి కీల నేతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి చెప్పారు. ట్రైన్ హైజాక్ చేసేందుకు మొత్తం 70 నుంచి 80 మంది వేర్పాటువాదులు పాల్గొన్నట్లు మంత్రి పేర్కొన్నారు. అసలు ఈ సంస్ధ ఆవిర్బావం గురించి తెలియాలంటే.. మనం1947 నాటి పరిస్థితులోకి వెళ్లాలి.

భారత్‌కు 1947లో స్వాతంత్య్రం వచ్చాక పాకిస్థాన్‌ భారత్‌ను నుంచి వీడిపోయి మరో దేశంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అప్పుడు పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. కానీ 1948లో పాకిస్థాన్‌ బలోచిస్థాన్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దీంతో అప్పటినుంచి బలోచిస్థాన్ ప్రజలు తమ రాజకీయ, సాంస్కృతిక గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారు. 1970లో బలూచ్ ప్రజలు పాకిస్థాన్‌ నుంచి విడిపోయేందుకు చాలాసార్లు యత్నించారు. కానీ పాకిస్థాన్ సైనిక చర్య ప్రారంభించి బలూచ్‌ ప్రజల పోరాటాన్ని అణిచివేసింది. ఈ క్రమంలోనే పలు గ్రూపులు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నాయి. అలా ఏర్పడిందే బలూచ్‌ లిబరేషన్ ఆర్మీ.

పాకిస్థాన్ నుంచి విడిపోయి బలూచిస్థాన్‌ ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలని, తమకు స్వయం నిర్ణయాధికారం ఉండాలని బీఎల్‌ఏ డిమాండ్ చేస్తోంది. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఈ వేర్పాటువాద సంస్థ పాకిస్థాన్‌ సైన్యంపై దాడులకు పాల్పడుతునే ఉంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌తో సహా అమెరికా, యూకేలు ఈ బీఎల్‌ఏను ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. ఈ బలూచిస్థాన్ ప్రాంతం అనేది నైరుతి పాకిస్థాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ అఫ్గానిస్థాన్‌లలో వ్యాపించి ఉంది. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. చైనా- పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టారు. ఇది బలూచిస్థాన్‌ మార్గం గుండా వెళ్తోంది. ఆర్థిక వృద్ధికి సిపెక్‌ దోహదపడుతుందని పాక్‌ ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు తమ ప్రాంత వనరులను కొల్లగొట్టేందుకు ఇదో ఎత్తగడ అని బలూచిస్థాన్‌ వాసులు వాదిస్తున్నారు. దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. అందుకే ఈమధ్య కాలంలో సిపెక్‌కు చెందిన ప్రాజెక్టులు, సిబ్బందిపై, చైనీయులపై అక్కడ దాడులు పెరిగిపోయాయి. మరోవైపు బలూచ్‌ తిరుగుబాటును పాకిస్థాన్‌ అణిచివేస్తుండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం 2011 నుంచి దాదాపు 10 వేల మంది బలూచ్‌ ప్రజలు అదృశ్యమయ్యారు. అయితే పాకిస్థాన్‌లో బలూచిస్థాన్‌ వేర్పాటువాదులు వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు. రైల్వేలైన్లు, పోలీస్ స్టేషన్లు, వాహనాలపై దాడులకు తెగబడుతున్నారు. బస్సులో నుంచి ప్రయాణికులను కిందకి దించి వాళ్ల గుర్తింపు కార్డులు చూసి మరి కాల్చిచంపిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఆత్మాహుతి బాంబర్లను మొదట స్నిపర్స్‌ చంపేశారు. అనంతరం ఒక్కో కంపార్ట్‌మెంట్‌ లోని టెర్రరిస్టులను హతమారుస్తూ వచ్చారు పాక్ ఆర్మీ. తమ ఆపరేషన్‌ సమయంలో ప్రయాణికులకు ఎవరికీ ఏం జరగలేదు. ప్రస్తుతం ఘటన ప్రాంతంలో మిలిటెంట్లు ఎవరూ బతికిలేరు.అయితే బాంబు నిర్వీర్య దళం రైలును చెక్‌ చేస్తోంది. తమ ఆపరేషన్‌ కొనసాగుతున్న సమయంలో పారిపోయిన ప్రయాణికులను ఒక్కదగ్గరికి చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Leave a Reply