Nimisha Priya: ఉరిశిక్ష రద్దు.. త్వరలో విడుదల కానున్న నిమిష ప్రియ!

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష ఇటీవల వాయిదా పడిన విషయం తెలిసిందే. జూలై 16న ఆమెకు శిక్ష అమలవ్వాల్సి ఉండగా, చివరి క్షణాల్లో అక్కడి అధికారులు ప్రక్రియను నిలిపివేశారు. ఇక ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కూడా ఆమెను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న కేఏ పాల్, నిమిష ప్రియ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

హౌతీ నాయకులు నిమిష ప్రియను విడుదల చేసేందుకు అంగీకరించారని కేఏ పాల్ వెల్లడించారు. మీడియా ద్వారా బ్లడ్ మనీపై వస్తున్న వార్తల కారణంగా బాధితుడి సోదరుడు మనస్తాపానికి గురవుతున్నారని చెప్పారు. అయితే బాధితుడి కుటుంబంలో సోదరుడు తప్ప, మిగతావారంతా నిమిష ప్రియ విడుదలకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు.

దేవుని దయతో హౌతీ లీడర్లను, బాధితుడి కుటుంబాన్ని నచ్చజెప్పగలిగామని కేఏ పాల్ తెలిపారు. హౌతీ అధ్యక్షుడు కూడా దీనికి అంగీకరించి 7 రోజుల సమయం ఇచ్చారని చెప్పారు. మరో నాలుగు రోజుల్లో శుభవార్త అందిస్తానని, నిమిష ప్రియ విడుదలై భారత్‌కు పంపబడుతుందని లేదా తానే తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply