ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. యువత విదేశీ వస్తువులను కొనడం తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులను ఇంటికి తీసుకురావడం అనే అలవాటును మానుకోవాలని సూచించారు. యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఆయన వెల్లడించారు.
మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో స్వయం సమృద్ధి (Self Reliance) తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశీయంగా తయారైన సెమికండక్టర్ చిప్ మార్కెట్‌లోకి రానుందని, అలాగే స్వదేశీ 6జీ నెట్‌వర్క్ వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ కంటే పెద్ద దేశభక్తి
“ఆపరేషన్ సిందూర్ మాత్రమే దేశభక్తికి ప్రతీక కాదు. వ్యాపారులు స్వదేశీ వస్తువులనే విక్రయించాలని నిర్ణయించడం వల్లే నిజమైన దేశభక్తి చూపవచ్చు. స్కిల్ ఇండియా ద్వారా కోట్లాది మంది యువత నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తయారవుతున్నారు. ప్రపంచ దేశాలు వృద్ధాప్య సమస్యను ఎదుర్కొంటున్న వేళ, యువతను అందించే శక్తి భారత్‌కే ఉంది. రాబోయే రోజుల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. అందుకే మనమందరం స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలి” అని మోదీ స్పష్టం చేశారు.
స్వదేశీ వాడకం వల్ల లాభాలు
స్వదేశీ వస్తువుల వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రధాని వివరించారు:
దేశీయ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, చేతివృత్తులకు ఊతం లభిస్తుంది.
విదేశీ దిగుమతులు తగ్గిపోవడంతో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.
దేశీయ సంస్కృతి, కళలు, సంప్రదాయాలు కాపాడబడతాయి.
గ్రామీణ, పట్టణ స్థాయిలోని చేతివృత్తులు, చిన్న వ్యాపారాల జీవనోపాధి మెరుగుపడుతుంది.
ప్రధాని మోదీ పిలుపు స్పష్టంగా ఒక విషయం చెబుతోంది.. దేశం అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. స్వదేశీని ప్రోత్సహిస్తే, భారత్ నిజమైన స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుంది.