జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడిలో 28 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనికి ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఇచ్చిన శక్తులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) కీలక నిర్ణయాన్ని ప్రకటించనుందని సమాచారం. భారత్-పాకిస్థాన్ మధ్య 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందంను నిలిపివేయడానికి భారత్ సిద్ధమవుతుందని సమాచారం. ఈ ఒప్పందం రద్దు వల్ల పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం పడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సింధు జలాల ఒప్పందం – నేపథ్యం ఏంటి..?
భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య 1960 సెప్టెంబర్ 19న కుదిరిన ఈ ఒప్పందాన్ని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ లు సంతకం చేశారు. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం, తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నీటిని భారత్ వినియోగించుకునే హక్కు ఉంది. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్ కు ప్రాధాన్యత ఉంది. పాకిస్థాన్ వ్యవసాయాన్ని నడిపించే నీటి 80% పశ్చిమ నదుల నుంచే లభిస్తుంది.
ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తే పాకిస్థాన్‌కు ఎలాంటి నష్టం కలుగుతుంది..?
* పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో వ్యవసాయం పూర్తిగా ఈ నదులపై ఆధారపడి ఉంది.
* నీటి సరఫరా ఆగిపోతే పంటల దిగుబడి తగ్గుతుంది, ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది.
* పాకిస్థాన్ జాతీయ ఆదాయంలో 23% వ్యవసాయ రంగం వాటా కలిగి ఉండగా, గ్రామీణ జనాభాలో 68% మంది జీవనోపాధి వ్యవసాయంపైనే ఉంది.
* మంగళా, టార్బెలా వంటి ప్రధాన డ్యామ్‌లు కలిపి పాకిస్థాన్ నీటి నిల్వ సామర్థ్యం కేవలం వార్షిక అవసరాల్లో 10% మాత్రమే.
* భూగర్భజలాలపై ఒత్తిడి పెరగడంతోపాటు, పంటల గల్స్, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఘటనల నేపథ్యంగా ఈ నిర్ణయం ఎందుకు కీలకం..?
పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్‌ను ఈ నరమేధానికి పరోక్షంగా బాధ్యుడిగా చూస్తోంది. “ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని ఉపేక్షించేది లేదు” అనే స్థాయిలో కేంద్రం స్పందిస్తుండటంతో, సింధు ఒప్పందం పునఃసమీక్ష ప్రధాన ఆయుధంగా ఉపయోగించే సూచనలు కనిపిస్తున్నాయి.
భారత్ తీసుకుంటున్న ఈ స్ట్రాంగ్ నిర్ణయం, కేవలం భద్రత పరంగా కాదు, వ్యూహాత్మకంగా కూడా పాక్‌ను ఒత్తిడిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది. పాక్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుండగా, నీటి ఒప్పందం రద్దు మరింత కష్టాల బాటలోకి నెట్టే అవకాశం ఉంది.