ఏనుగు-డ్రాగన్ కూటమి: అమెరికాపై వ్యూహాత్మక దండయాత్ర.. SCO సమ్మిట్‌లో మోడీ-జిన్‌పింగ్ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాల నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కలిసి సమావేశం కావడం అంతర్జాతీయంగా భారీ ఆసక్తి రేపింది. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు భాగంగా చైనాలోని టియాన్ జిన్‌లో ఈ ద్వైపాక్షిక భేటీ జరిగింది.

ఈ సమావేశం కేవలం సరిహద్దు సమస్యలపై చర్చించడానికే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై అమెరికా పెడుతున్న ఒత్తిడికి వ్యతిరేకంగా భారత్, చైనాలు ఒకే వేదికపైకి వచ్చాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఆధిపత్యానికి పరోక్షంగా సవాల్ విసిరిన భేటీగా ఇది నిలిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

సమ్మిట్ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ, “డ్రాగన్ (చైనా) – ఏనుగు (భారత్) కలిసి స్నేహపూర్వకంగా ముందుకు సాగితే ప్రపంచానికి అది ఎంతో ముఖ్యమైంది” అని వ్యాఖ్యానించారు. మోడీని మళ్లీ కలవడం సంతోషకరమని, ఇరు దేశాలు విభేదాలను సంభాషణల ద్వారానే పరిష్కరించుకోవాలని జిన్‌పింగ్ సూచించారు. భారత ప్రధాని మోడీ మాట్లాడుతూ, కజాన్ సమావేశం తరువాత సరిహద్దు శాంతి, స్థిరత్వం మెరుగుపడిందని, రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. భారత్-చైనా సత్సంబంధాలు 2.8 బిలియన్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు.

గల్వాన్ లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో, మోడీ-జిన్‌పింగ్ భేటీ కీలకమైన మలుపుగా మారింది. సరిహద్దు శాంతి, ఆర్థిక సహకారం, వాణిజ్యం, శాస్త్ర సాంకేతిక రంగాలలో భాగస్వామ్యాన్ని పెంపొందించే అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఈ భేటీ అనంతరం ఇరు దేశాలు పలు రంగాల్లో సహకారం పెంచుకోవడానికి ఒప్పందం కుదుర్చుకోవడం, భారత్-చైనా సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలికిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నడుస్తున్న వేళ, భారత్-చైనా సత్సంబంధాలు వ్యూహాత్మకంగా చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Leave a Reply