Trump vs Elon Musk: ట్రంప్‌తో గొడవ.. ఒక్క రోజులో మస్క్‌కు రూ.13 లక్షల కోట్లు నష్టం!

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్తాయి. గతంలో “అమెరికా ఫస్ట్” భావజాలంలో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు ఇప్పుడు బహిరంగంగా విమర్శించుకుంటున్నారు. ఇదంతా ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ (One Big Beautiful Bill) అనే వివాదాస్పద బిల్లుతో ప్రారంభమైంది.

టెస్లా షేర్ల పతనం.. మస్క్‌కి భారీ నష్టం
ఈ వివాదం ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యంపై తీవ్రమైన ప్రభావం చూపించింది. టెస్లా షేర్లు ఒక్కరోజే 14 శాతం పడిపోయాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో టెస్లా మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్ల నుండి 916 బిలియన్ డాలర్లకు పడిపోయింది. మస్క్ సంపదలో 152 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 13 లక్షల కోట్ల) నష్టం వచ్చిందని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇది టెస్లా స్థాపితమైన నాటి నుండి ఒకే రోజు జరిగిన అతిపెద్ద నష్టం.

ట్విట్టర్‌లో వార్.. ఎప్‌స్టీన్ ఫైల్ వివాదం
ఈ గొడవకు కారణం మస్క్ చేసిన వరుస ట్వీట్లే. ఓ యూజర్ ట్రంప్‌ను అభిశంసించి, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని ట్వీట్ చేయగా, దానికి మస్క్ సంపూర్ణ మద్దతు తెలిపారు. అంతే కాదు.. “ఇది భవిష్యత్తులో జరుగుతుందని గుర్తుంచుకోండి” అంటూ వ్యాఖ్యానించారు.

అంతే కాదు, మస్క్ మరో బాంబ్ పేల్చారు. “ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉంది.. అందుకే వాటిని బయటపెట్టడంలేదు,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ, “ఎలాన్ మస్క్‌కి ప్రభుత్వం కాంట్రాక్టులు ఇవ్వడం ఆపేస్తాం. విద్యుత్ వాహనాల విషయంలో అతడు అమెరికన్లపై ఒత్తిడి తేవాలని అనుకుంటున్నాడు, నేను అంగీకరించలేదు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు,” అంటూ బహిరంగంగానే మండిపడ్డారు.

Leave a Reply