అమెరికా ప్రభుత్వం తరపున కీలక పదవి నుంచి వైదొలుగుతున్న టెక్ మేధావి ఎలాన్ మస్క్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మస్క్‌కు బంగారు రంగుతో కూడిన ప్రత్యేక తాళం చెవిని బహుమతిగా అందించారు. “ఈ గిఫ్ట్‌ను నేను అత్యంత ప్రత్యేకమైన వ్యక్తులకే ఇస్తాను” అని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలో ట్రంప్ అధ్యక్షతన ఏర్పడిన ప్రభుత్వం సమయంలో “డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ” (DOGE)కి నాయకత్వం వహిస్తూ మస్క్ పనిచేశారు. దాదాపు ఆరు నెలల సేవల అనంతరం మే 30వ తేదీతో మస్క్ పదవికి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధ్యక్షుడిని కలిసి వీడ్కోలు పలికారు.
మస్క్ సేవలను కొనియాడిన ట్రంప్
వీడ్కోలు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ట్రంప్ మాట్లాడుతూ, “ఎలాన్ మస్క్ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించారు. ఆయన ప్రపంచంలోని అత్యుత్తమ వ్యాపారవేత్తల్లో ఒకరు. అమెరికా తరఫున మేము ఆయన సేవలకు కృతజ్ఞతలు చెబుతున్నాం” అని ప్రశంసించారు.
అధ్యక్షుడికి ఎప్పుడూ తోడుగా ఉంటా: మస్క్
తర్వాత మస్క్ మాట్లాడుతూ, “DOZE పదవికి గడువు పూర్తి కావడంతోనే నేను తప్పుకుంటున్నా. కానీ అమెరికా అధ్యక్షుడికి ఎప్పుడూ తోడుగా ఉంటా. అవసరమైతే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాను” అన్నారు. తాను తరుచూ అధ్యక్ష కార్యాలయాన్ని సందర్శిస్తానని చెప్పారు.
వివాదాల మధ్య వదిలిన మస్క్ పదవి
DOGE అధికారిగా మస్క్ ప్రభుత్వం ఖర్చులను తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా కొంతమంది ఉద్యోగులను తొలగించారు. దీని వల్ల విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, మస్క్ తన పాలనలో ప్రభుత్వం 11 బిలియన్ డాలర్లను సేవ్ చేసిందని వెల్లడించారు. ఇక ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్” పై మస్క్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్లనే ఆయన పదవి నుండి తప్పుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. కానీ అమెరికా చట్టాల ప్రకారం ఏ ఒక్కరికి 130 రోజులకు మించి DOGE హోదా ఇవ్వరాదు. ఈ ప్రకారమే మే 30తో మస్క్ గడువు ముగిసింది.