Tesla India: టెస్లా ఇండియాలో అడుగుపెట్టింది.. ఫస్ట్ షోరూమ్ లాంచ్‌కు రంగం సిద్ధం

మొత్తానికి ఎలాన్ మస్క్‌ యొక్క టెస్లా కంపెనీ భారత్‌కి రానుందన్న వార్తలు నిజమవుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహన రంగంలో గ్లోబల్ దిగ్గజం అయిన టెస్లా, భారత మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ జులై 15న ముంబైలో మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

ముంబై బీకేసీ లో మొదటి షోరూమ్
ఎక్స్ (ట్విటర్) ద్వారా కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం, ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో తమ తొలి షోరూమ్‌ను ప్రారంభించబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ, ముంబైలలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ లింక్డ్ ఇన్ వేదికగా జారీ చేసిన టెస్లా, ఎట్టకేలకు ముంబైలో అధికారిక ఎంట్రీకి సిద్ధమవుతోంది.

విశాల స్థలంలో టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్
టెస్లా ముంబైలో 4,000 చదరపు అడుగుల రిటైల్ స్పేస్‌ను లీజుకు తీసుకుంది. ఇది కుర్లా వెస్ట్‌లో ఉంది. దీన్ని షోరూం‌తో పాటు కార్ల సర్వీస్ సెంటర్‌గా కూడా ఉపయోగించనున్నారు. ప్రస్తుతం భారత్‌లో టెస్లాకు పుణెలో ఇంజనీరింగ్ హబ్‌, బెంగళూరులో రిజిస్టర్డ్ కార్యాలయం, BKC సమీపంలో తాత్కాలిక కార్యాలయం ఉన్నాయి.

1 మిలియన్ డాలర్ల విలువైన EVలు దిగుమతి
షోరూమ్ ప్రారంభానికి ముందే టెస్లా దాదాపు రూ. 8.58 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఇందులో ప్రధానంగా చైనా, అమెరికాల నుంచి తెచ్చిన Model Y కార్లు ఉన్నాయి. భారత్ విదేశీ EVలపై దాదాపు 70% దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ, టెస్లా ఈ మార్కెట్‌పై పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తోంది.

భవిష్యత్తులో ఇండియాలోనే టెస్లా ప్లాంట్?
ఈ ఎంట్రీ తర్వాత ఇండియాలోనే టెస్లా అసెంబ్లీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న యోచనలో కూడా కంపెనీ ఉన్నట్లు సమాచారం. భారతీయ EV రంగానికి ఇది గేమ్ చేంజర్ కావచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply