Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశానికి అమెరికా వీసాలు నిలిపివేత..!

ఇజ్రాయెల్ గాజాపై హమాస్‌ను అంతం చేయడానికి దాడులు కొనసాగించగా, ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి గాజా ప్రజలకు అమెరికా వీసాలు నిలిపివేయబడ్డాయి. గాజా పౌరులు గాయపడి, చికిత్స కోసం అమెరికాకు వచ్చే సందర్భాలు ఎక్కువైందని ఫిర్యాదులు వచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

“తాత్కాలిక వైద్య మానవతా వీసాలు జారీ చేసే ప్రక్రియపై సమీక్ష జరుపుతున్నాం. గాజా నుంచి అమెరికాకు వచ్చే పాలస్తీనియన్లు హమాస్‌కు అనుకూలంగా ఉన్నారని, నిధులు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అన్ని వీసాలను నిలిపివేసాం. గతవారం 11 పాలస్తీనియన్ చిన్నారులు గాయపడ్డారు. వారిని ‘హీల్ పాలస్తీనా’ స్వచ్ఛంద సంస్థ అమెరికాకు తీసుకువచ్చి చికిత్స అందించడానికి సహకరించింది. కానీ పెద్దమొత్తంలో ఇలా గాజా ప్రజలను తరలించడం సరైనది కాదని విదేశాంగ శాఖ పేర్కొంది.”

అయితే, గాజా పౌరులపై అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా ఆధారిత ‘పాలస్తీనా చిల్డ్రన్స్ రిలీఫ్ ఫండ్’ కూడా వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. గత 30 ఏళ్లుగా వేలాది పాలస్తీనా చిన్నారులు మెరుగైన వైద్య చికిత్స కోసం అమెరికాకు తరలించబడ్డారని, గాజాపై ఇజ్రాయెల్ దాడుల వల్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోుతున్నారని ఈ సంస్థ పేర్కొంది.

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ గాజాపై పట్టు సాధించడానికి వెనక్కి తగ్గడం లేదు. దశలవారీ ప్లాన్ ప్రకారం, వచ్చే 5 నెలల్లో గాజాలో అనేక ప్రాంతాలను హస్తగతం చేసుకోవాలని యోచిస్తోంది. దాదాపు 10 లక్షల పాలస్తీనియన్లను ఖాళీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, హమాస్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రయత్నాలు ఫలించలేదు.

తాజా పరిస్థితులు గాజాలో తీవ్రమైనవిగా ఉన్నాయి.. ప్రస్తుతం అనేకమంది తిండి లేక చనిపోతున్నారు. మరణాల్లో ఎక్కువగా చిన్నారులు ఉండటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగిసే అవకాశాలు కనిపించడం లేదు.

Leave a Reply