అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య సమావేశం వైట్ హౌస్‌లో జరిగింది. ఈ సమావేశం అనంతరం ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే దిశగా చర్చలు ముందుకు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావడానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
జెలెన్‌స్కీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడిరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ భద్రతా హామీలపై విస్తృతంగా చర్చలు జరగ్గా, జెలెన్‌స్కీ ట్రంప్ ప్రతిపాదనకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ట్రంప్ ప్రకటన ప్రకారం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భేటీకి సిద్ధమని ఆయన తెలిపాడు. “జెలెన్‌స్కీతో చర్చించిన తర్వాత పుతిన్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడాను. ఇద్దరూ సమావేశం కావడానికి అంగీకరించారు. అమెరికా దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో వెల్లడించారు. అయితే ఈ సమావేశం ఎక్కడ జరగాలనేది ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు.
నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సమన్వయంతో రష్యా-ఉక్రెయిన్ సమావేశం జరగనున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ చర్చలను “నిర్మాణాత్మకంగా” జరిగాయని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ, “ఈ త్రైపాక్షిక సమావేశం చరిత్రలో నిలిచిపోయే ముందడుగు. అయితే, రష్యా అధ్యక్షుడితో సమావేశానికి ముందే కాల్పుల విరమణ ప్రకటిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది” అని అన్నారు.
ఇక నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె మాట్లాడుతూ, “ఉక్రెయిన్ మౌలిక వసతులపై దాడులను అడ్డుకోవడంలో మిత్రదేశాలు కలిసిరావాలి. యుద్ధం నిలిపి, శాంతి దిశగా కదలాల్సిన సమయం వచ్చింది” అని వ్యాఖ్యానించారు.