పేదల నుంచి వీర్యం దందా.. పోర్న్ వీడియోలు చూపించి శాంపిల్స్! సృష్టి IVF కేసులో సంచలనం

సృష్టి IVF టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్కాంలో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సరోగసీ పేరుతో పేద కుటుంబాలను వంచించి శిశువులను తక్కువ ధరకు సేకరించి, వారిని లక్షల్లో విక్రయించిన కేసులో తాజాగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని బిచ్చగాళ్లను టార్గెట్ చేస్తూ, వారికి బీరు, బిర్యానీ ఇవ్వడం ద్వారా మాయమాటలు చెప్పి వీర్యం సేకరించారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా, కొందరికి పోర్న్ వీడియోలు చూపించి శాంపిల్స్ తీసుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. గోపాలపురం పోలీసులు సృష్టి క్లినిక్‌ నుంచి IVF, సరోగసీ కేసులకు సంబంధించిన వందలాది రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సెంటర్‌కు హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, కొండాపూర్ బ్రాంచీలతో పాటు, విజయవాడ, విశాఖ, ఒడిశా, కోల్‌కతాలోనూ బ్రాంచీలు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు ‘ఇండియన్ స్పెర్మ్ టెక్’ అనే సంస్థను కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఈ సంస్థ వందలాది పేద యువకుల నుంచి వీర్యం, అండాలు సేకరించి వాటిని అహ్మదాబాద్‌కు తరలించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీర్యం ఇస్తే రూ.800 నుంచి రూ.4000, అండం ఇస్తే రూ.10 వేల నుంచి రూ.25 వేలు వరకూ ఇచ్చేవారని తెలుస్తోంది. వీరు రోజువారీ కూలీలు, విద్యార్థులు, పేద మహిళలను టార్గెట్ చేసినట్టు సమాచారం.

ఈ దందాపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. పత్రికా కథనాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, ఆగస్టు 28 లోగా ఆరోగ్య శాఖ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పోలీసులు కూడా IVF ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు ఫోన్లు చేసి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ముమ్మాటికి ఇది ఒక సంస్థగా మానవత్వాన్ని తాకట్టు పెట్టి, వ్యాపారంగా మలచిన ఉదంతమని నిపుణులు చెబుతున్నారు.

ఈ కేసు వల్ల IVF, సరోగసీ ప్రక్రియలపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగా సంతానం కోసం వెళ్లిన కుటుంబాలు మోసపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు ఈ ఘటనను లెక్కలోకి తీసుకుని, అలాంటి క్లినిక్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆరోగ్యాన్ని, సంతాన ఆశను వ్యాపారంగా మార్చే ఈ వ్యవస్థపై సమగ్ర విచారణ అవసరమని సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Leave a Reply