సనాతన ధర్మంలో భోజనానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇవి కేవలం తినే పద్ధతులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలికి కూడా ఉపయోగపడతాయని చెబుతారు. ఈ నియమాలు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందిస్తాయి. భోజనం చేసే సమయం, కూర్చునే దిక్కు, శుచిశుభ్రత, ఆహారాన్ని గౌరవించడం వంటి అంశాలు ఇందులో భాగం. తూర్పుదిక్కున కూర్చుని భోజనం చేయడం, నిలబడి తినకపోవడం, వంటకు ముందు స్నానం చేయడం వంటి నియమాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవి పాటించడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కావడంతో పాటు ధన, ధాన్యాలకు లోటు ఉండదని నమ్మకం. సనాతన ధర్మంలో అన్నాన్ని అన్నపూర్ణ తల్లికి సంకేతంగా భావిస్తారు. అయితే కొందరు అలవాటుగా ప్లేట్లో భోజనం మిగల్చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల జీవితంలో ఏవిధమైన ప్రభావాలు వస్తాయో తెలుసుకోవాలి.
ప్లేట్లో మిగిలిన ఆహారం ప్రభావం
పెద్దలు ఎప్పుడూ “ఎంత కావాలో అంతే తీసుకో” అని చెబుతారు. కానీ కొంతమంది ఎక్కువ తీసుకుని తినకపోయి వదిలేస్తారు. ఇలా ప్లేట్లో ఆహారం వదిలేయడం అన్నపూర్ణ మాతను అవమానించినట్టే అని పెద్దలు అంటారు. ఈ అలవాటు ఉన్న వారి జీవితంలో సంపద, శ్రేయస్సు తగ్గిపోతుందని నమ్మకం. ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం రాకపోవచ్చు. ఆహారాన్ని వృథా చేసే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని, పూజలు, వ్రతాలు చేసినా ఫలితం ఉండదని చెబుతారు. పూర్వీకుల ఆశీర్వాదం దక్కదని, శని ప్రభావం పెరుగుతుందని కూడా నమ్మకం ఉంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం
ఆహారాన్ని వృథా చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలహీనమవుతాడు. దీని కారణంగా వ్యక్తి మానసిక ఒత్తిడితో బాధపడతాడు, ఆయుష్షు తగ్గుతుందని నమ్మకం. బుధుడు, గురువు బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అలవాట్లు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్లేట్లో మిగిలిన ఆహారాన్ని ఆవులకు పెట్టడం మంచిది కాదని, ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి తామసిక పదార్థాలు ఉంటే అది మతపరంగా అనుచితం అని అంటారు.
అందుకే ఎల్లప్పుడూ ఆహారాన్ని గౌరవించి, అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. పండితులు చెబుతున్నట్టు ఈ చిన్న అలవాటు మన జీవితాన్ని పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తుంది.