Upasana : ఆయనతో నా ప్రయాణం ముగిసింది.. ఉపాసన సోషల్ మీడియా పోస్ట్ వైరల్

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన ఇటీవల తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో ఆచరించి పూర్తి చేశారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు.

వరుస విజయాలతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్ భార్య ఉపాసన గురించి అందరికీ తెలిసిందే. ఆమె కేవలం రామ్‌చరణ్ సతీమణిగానే కాకుండా, అపోలో ఆసుపత్రుల వైస్ చైర్ పర్సన్‌గా, సామాజిక కార్యక్రమాల్లోనూ తన ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ఇటీవల ఉపాసన చేసిన సాయిబాబా వ్రతం ముగియడంతో ఆమె షిర్డీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకోనున్నట్లు తెలిపింది.

గురు పౌర్ణమి నాడు ప్రారంభించిన ఈ వ్రతం సెప్టెంబర్ 4తో ముగిసింది. తన సోదరి లతా సిస్టర్‌తో కలిసి ప్రారంభించిన ఈ వ్రతం ద్వారా బాబా ఆశీస్సులు మరింతగా లభించాయని ఆమె పేర్కొన్నారు.

“గురు పౌర్ణమి నాడు నేను ప్రారంభించిన సాయిబాబా వ్రతం 9 వారాల పాటు కొనసాగింది. శాంతి, స్వస్థత, విశ్వాసంతో నా ప్రయాణం ముగిసింది. నా జీవితంలో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేస్తానని బాబాను ప్రార్థించాను. నిత్యం మాకు రక్షణగా ఉన్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు. అత్తమ్మాస్ కిచెన్ తరపున ఈ రోజు భోజనం వడ్డిస్తున్నాము.. జై సాయిరామ్” అని పేర్కొంది.

చిన్నప్పటి నుంచే తనకు దేవుడి మీద గాఢమైన భక్తి ఉందని ఉపాసన చెప్పిన విషయం తెలిసిందే. వ్రతం ప్రారంభించినప్పటి నుంచి సానుకూల ఆలోచనలు, మంచి పరిస్థితులు అలవడ్డాయని కూడా తెలిపింది. భక్తి, నిష్టతో సాయిబాబా వ్రతం చేస్తే అన్ని మనోభీష్టాలు నెరవేరుతాయని సాయి భక్తుల నమ్మకం.

తన బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా వ్రతం పూర్తి చేయడం పట్ల రామ్‌చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు.

Leave a Reply