Fish Venkat: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత..!

టాలీవుడ్‌ సినీ పరిశ్రమ మరోసారి విషాదంలో మునిగిపోయింది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్) కిడ్నీ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని చందానగర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలు పనికిరాకపోవడంతో మార్పిడి అవసరమైందని, అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెద్ద ఎత్తున చికిత్స అందించలేకపోయామని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఆయన కుమార్తె మీడియా ద్వారా సహాయం కోరినా, పరిస్థితి మరింత విషమించడంతో ప్రాణాలు నిలవలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముషీరాబాద్ మార్కెట్‌లో చేపల వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు అక్కడి ప్రజలు వెంకటేశ్‌ని ‘ఫిష్ వెంకట్’గా పిలవడం ప్రారంభించారు. ఆ తరువాత దివంగత నటుడు శ్రీహరి పరిచయంతో సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఆయన, దర్శకుడు వీవీ వినాయక్‌ తెరకెక్కించిన చిత్రంలో చిన్న పాత్ర పోషించి గుర్తింపు పొందారు. సహజమైన డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో తక్కువ సమయంలోనే ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. వందకు పైగా సినిమాల్లో హాస్యనటుడిగా, చిన్నపాటి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆది, దిల్, బన్ని, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ని సృష్టించుకున్న ఆయన మరణం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికే పలువురు నటులు, దర్శకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఫిష్ వెంకట్ ఆత్మకు శాంతి చేకూరాలని సినీ వర్గాలు, అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a Reply