Thug Life: థగ్ లైఫ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్.. మణిరత్నం కాంబో సత్తా చూపించిందా?

థగ్ లైఫ్ సినిమా కమల్ హాసన్ మరియు మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన మరో భారీ ప్రాజెక్ట్. కమల్ హాసన్‌తో పాటు శింబు, త్రిష, అశోక్ సెల్వన్, నాజర్, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలైంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.

కథ:

రంగరాయ శక్తి రాజన్ (కమల్ హాసన్), మాణిక్యం (నాజర్) ఇద్దరూ ఢిల్లీలో గ్యాంగ్ స్టర్స్. ఓ కాల్పుల ఘటనలో ఓ పేపర్ వేసే వ్యక్తి చనిపోతాడు. అతని పిల్లలు అమర్, చంద్ర అనుకోకుండా విడిపోతారు. అమర్‌ను శక్తి కాపాడి, చెల్లిని వెతికి తేవాలని మాటిస్తాడు. తరువాత శక్తి ఢిల్లీ మాఫియాలో కీలకంగా మారతాడు. శక్తిపై పోలీస్ కేసు నమోదవడంతో, అతను పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సి వస్తుంది. మిగతా వ్యవహారాలను అమర్ చూసుకుంటాడు. ఇది మాణిక్యం మరియు ఇతరులకు నచ్చదు. శక్తి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతనిపై దాడి జరుగుతుంది. దీంతో అమర్ మీద అనుమానం వస్తుంది. ఇక రాను అన్న అనే మరో గ్యాంగ్ స్టర్ ఇద్దరినీ చంపాలనుకుంటాడు. చివరకు శక్తి ఈ కుట్రలను ఎలా ఎదుర్కొన్నాడు, రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది సినిమా కథ.

మణిరత్నం – కమల్ హాసన్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడతాయి. ‘నాయకుడు’ సినిమా గుర్తుకు వచ్చేలా, ఈసారి కూడా ఒక ఎమోషనల్ డ్రామా ఆధారంగా కథను నిర్మించారు. ఫస్ట్ హాఫ్ అంతా శక్తి, అమర్ పాత్రల పరిచయం, అంతర్గత కుట్రలు, మాణిక్యం – సదానంద్ ల వ్యూహాలతో నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు వరకు సినిమా అంతగా ఆసక్తికరంగా సాగకపోయినా, ఇంటర్వెల్ తర్వాత శక్తి పాత్ర హిమాలయాల్లో సర్వైవల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ లో కథ ఓ రేంజ్‌కి చేరుతుంది.

కథలో కొన్ని అంశాలు అసంబద్ధంగా అనిపించవచ్చు. ఉదాహరణకు త్రిష పాత్ర ఇంద్రాణితో ఉన్న రొమాన్స్ ట్రాక్ అనవసరంగా కనిపిస్తుంది. కమల్ – త్రిష – శింబు మధ్య ప్రేమ త్రికోణం కథతో లింక్ లేకుండా ఉంచడం కథను కొంత డైల్యూషన్ చేసేలా మారింది. కొన్ని ట్విస్టులు ముందు నుంచి ఊహించగలిగేలా ఉండటం వల్ల థ్రిల్ కూడా తగ్గుతుంది. అయినా కూడా కొన్ని కీలక మలుపులు సినిమా పట్టు దాటకుండా ఉంచాయి.

నటీనటులు:

నటీనటుల అభినయ పరంగా కమల్ హాసన్ మరోసారి తన క్లాస్ ప్రెజెంట్ చేసి మెప్పించారు. యాక్షన్, భావోద్వేగం రెండింటిలోనూ తాను ఏ స్థాయిలో ఉన్నాడో చూపించారు. శింబు విభిన్నమైన పాత్రలో బాగా నటించాడు. త్రిష పాత్రకు స్కోప్ లేకపోయినా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అభిరామి భార్య పాత్రలో సహజంగా కనిపించింది. మిగిలిన క్యాస్టింగ్ లో నాజర్, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా:

సాంకేతికంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్స్, లొకేషన్స్, కాలానికి తగ్గ స్టైల్ లో చిత్రీకరించారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే పాటలు మాత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ కూడా ప్రత్యేకంగా మెచ్చుకోదగ్గది. మణిరత్నం దర్శకత్వం ఈసారి ఎక్కువగా ఎమోషనల్ డ్రామాపై ఫోకస్ చేసింది. యాక్షన్ కంటే భావోద్వేగం పై అధికంగా నిలబడిన కథనం.

ఫైనల్ గా:

మొత్తానికి థగ్ లైఫ్ సినిమా ఓ సాధారణ గ్యాంగ్ స్టర్ కథను భావోద్వేగాల ముడిపడి చూపించడానికి చేసిన ప్రయత్నం. కథనం ఎక్కువగా డ్రామాగా మారడంతో కమర్షియల్ ప్రేక్షకులకు కొంత మేర నిరాశ కలిగించవచ్చు. కానీ మణిరత్నం – కమల్ హాసన్ అభిమానులైతే ఓసారి చూసే సినిమా. అంచనాలు లేకుండా వెళ్తే కొంతవరకు సంతృప్తి పడొచ్చు.

ప్రజ్ఞ మీడియా రేటింగ్: 2.75/5

Leave a Reply