కుర్ర హీరో తేజ సజ్జా ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో ఊపు మీద ఉన్నాడు. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి సూపర్ హీరో చిత్రాలతో వరుసగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు. చిన్న హీరో అంటూ విమర్శించిన వారిని తన ప్రతిభతో, బాక్సాఫీస్ స్టామినాతో సమాధానం చెప్పాడు.
తాజాగా విడుదలైన ‘మిరాయ్’ కేవలం 7 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ రికార్డు స్థాయి వసూళ్లు అందుకుంటోంది. ఇప్పటివరకు అమెరికాలో $2.5 మిలియన్ వసూలు చేసి, ఇప్పుడు $3 మిలియన్ల వైపు దూసుకెళ్తోంది. ముఖ్యంగా, ఓవర్సీస్‌లో వరుసగా $2.5 మిలియన్ మార్క్ అందుకున్న హీరోగా తేజ అరుదైన ఘనత సాధించాడు. ఇదే రికార్డును గతంలో ‘హనుమాన్’తో కూడా సాధించాడు.
ఈ రేర్ ఫీట్‌ను సాధించిన వారు ఇప్పటివరకు స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఇప్పుడు వారి తరువాత మూడవ హీరోగా తేజ సజ్జా పేరు చేరింది.
‘మిరాయ్’ ఎనిమిదవ రోజు కూడా స్ట్రాంగ్ నెంబర్స్‌ను నమోదు చేసింది. శనివారంనాడు బుక్‌మైషోలోనే 1.2 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడవ్వడం విశేషం. తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టి, నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
కార్తిక్ ఘట్టమని దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌లో తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా, శ్రియా, జగపతి బాబు, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో తేజ అశోకుడి కాలం నాటి తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలను కాపాడే యోధుడిగా నటించాడు. మంచు మనోజ్ ఆ గ్రంథాలను స్వాధీనం చేసుకోవాలనుకునే ప్రతినాయకుడిగా కనిపించాడు.
సూపర్ హీరోగా తేజ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా VFX పై ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అందించారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.