Rajamouli : కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి.. 120 దేశాల్లో విడుదల కానున్న SSMB29!

ఎస్‌.ఎస్‌. రాజమౌళి SSMB29 షూటింగ్‌లో భాగంగా కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావాదితో పాటు పలువురు ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను మంత్రి స్వయంగా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

‘RRR’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ SSMB29. తొలిసారి మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో, విజువల్ వండర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. అందుకోసం రాజమౌళి టీమ్ దేశవిదేశాల్లో అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తోంది. తాజాగా ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు.

కెన్యా మంత్రి ట్వీట్

“ప్రపంచంలోనే గొప్ప దర్శకులలో ఒకరైన ఎస్‌.ఎస్‌. రాజమౌళి గత 15 రోజులుగా కెన్యాలో షూటింగ్ చేస్తున్నారు. ఆయన సినిమాలు బలమైన కథాంశాలు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 120 మంది సిబ్బందితో కూడిన టీమ్ ఆఫ్రికాలో అనేక ప్రాంతాలు పరిశీలించిన తర్వాత కెన్యాను ఎంచుకుంది. దాదాపు 95% సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు,” అని మంత్రి ట్వీట్‌లో తెలిపారు.

120 దేశాల్లో భారీ విడుదల

“మసాయి మారా మైదానాలు, నైవాషా, సంబురు, అంబోసెలి వంటి కెన్యా అందమైన ప్రాంతాలు ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద సినిమాగా నిలిచే SSMB29 లో భాగం కానున్నాయి. ఈ చిత్రం ఏకంగా 120 దేశాల్లో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్ ప్రేక్షకులను చేరుకుంటుందని అంచనా. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. మా దేశం అందాలు, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు ఒక వేదిక,” అంటూ మంత్రి ముదావాది తెలిపారు.

Leave a Reply