తెలుగు సంగీత రంగంలో కలకలం రేపిన యంగ్ సింగర్ ప్రవస్తి ఆరోపణలపై ప్రముఖ గాయని సునీత స్పందించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, సునీతలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రముఖ టీవీ పాటల షోలో మానసిక వేధింపులకు గురయ్యానని ప్రవస్తి పేర్కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో సునీత స్పందిస్తూ, “నిన్ను బాల్యంలో చూసి ముద్దు పెట్టుకున్నా. కానీ ఇప్పుడు వయసుతో పాటు బాధ్యత కూడా ఉండాలి. ఎవరైనా బాగా పాడితే మేము భావోద్వేగానికి లోనవుతాం, అది కామన్. నువ్వు పాటల ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేసిన దానివే కదా, అప్పుడు అక్కడ ఎలాంటి నిబంధనలుంటాయో నీకు తెలుసు. అన్ని పాటలు పాడే ఛాన్సు ఉండదు. కొన్ని ఛానళ్లకు కొన్ని పాటల హక్కులుంటాయి. అలాంటి విషయాలు పూర్తిగా చెప్పాల్సిందే. అప్పుడు తప్ప వాస్తవం బయటపడదు” అంటూ స్పందించారు.
ప్రవస్తి ఆరోపణలు విన్న తరువాత సంగీత రంగానికి చెందిన పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. నట్టి కుమార్ లాంటి వారు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరోవైపు లిప్సిక, హారిక వంటి ఇతర గాయని సింగర్లు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం న్యాయనిర్ణేతగా ఉన్న ఈ షోకు, ఇప్పుడు కీరవాణి, సునీత, చంద్రబోస్ లు జడ్జులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో టాలెంట్లకు అవకాశమిచ్చిన ఈ కార్యక్రమంపై ప్రవస్తి చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.