Shefali Jariwala: గుండెపోటుతో బిగ్‌బాస్ ఫేమ్ షెఫాలి జరివాలా మృతి.. సినీ ఇండస్ట్రీలో విషాదం

ప్రముఖ నటి, మోడల్ షెఫాలి జరివాలా (42) ఆకస్మిక మృతితో బాలీవుడ్ పరిశ్రమ విషాదంలో వుంది. శుక్రవారం రాత్రి ముంబైలో గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఈ వార్తతో అభిమానులు, స్నేహితులు, సహ కళాకారులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ప్రాథమిక సమాచారం మేరకు, షెఫాలి శుక్రవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే భర్త పరాగ్ త్యాగి సహా ముగ్గురు మిత్రులు ఆమెను బెల్లేవ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరణానికి గల ఖచ్చితమైన కారణం మాత్రం ఇంకా స్పష్టత కావాల్సి ఉంది.

షెఫాలి జరివాలా 2000లలో “కాంటా లగా” మ్యూజిక్ వీడియోతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ పాటతో ఆమెకు “కాంటా లగా గర్ల్” అనే బిరుదు రావడంతో పాటు పలు అవకాశాలు వచ్చాయి. తరువాత “ముజ్సే షాదీ కరోగీ” చిత్రంలో నటించగా, “బిగ్‌బాస్ సీజన్ 13″లో కంటెస్టెంట్ గా ఆమె మరింత ప్రజాదరణ పొందారు.

2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న షెఫాలి, 2009లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2015లో నటుడు పరాగ్ త్యాగిని వివాహం చేసుకుంది. అప్పటినుంచి ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తున్నారు.

షెఫాలి మృతిపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మన ప్రియమైన షెఫాలి ఇకలేరన్న వార్త నమ్మలేకపోతున్నాను’’ అంటూ ఓ నటుడు భావోద్వేగంగా స్పందించగా, మరొకరు ‘‘జీవితం ఎంత చిన్నదో మళ్లీ గుర్తుచేసింది.. బిగ్‌బాస్ 13లో ఆమెతో గడిపిన రోజులు గుర్తొస్తున్నాయి’’ అని రాశారు.

Leave a Reply