Rajinikanth: పవన్ కళ్యాణ్ పొలిటికల్ తుఫాన్.. రజినీకాంత్ ట్వీట్ వైరల్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు తలైవాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సూపర్ స్టార్‌కు విషెస్ తెలియజేశారు. రజినీపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

“స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సూపర్ స్టార్ రజినీకి శుభాకాంక్షలు. ఆయన పేరు బిగ్ స్క్రీన్‌పై కనిపించగానే థియేటర్లు ఎలా మారుమోగుతాయో ఎన్నో సార్లు చెన్నైలో చూశాను. తరాలు మారుతున్నా ఆయన క్రేజ్ ఎప్పటికీ తగ్గలేదు” అంటూ పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పవన్ ట్వీట్‌కు స్పందించిన రజినీకాంత్ కూడా ఆసక్తికర రిప్లై ఇచ్చారు. “నా ప్రియమైన మిత్రుడు, పొలిటికల్ తుఫాన్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అంటూ రజినీ స్పందించారు.

ఇదిలా ఉండగా.. రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కూలీ’ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మూడు రోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. తమిళ సినీ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.

మరోవైపు పవన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘ఓజీ’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 27న ‘ఓజీ’ విడుదల కానుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

Leave a Reply