పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా పౌరాణిక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించారంటూ ముదిరాజ్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ వారు ఉద్యమానికి దిగారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, క్రిష్ – జ్యోతి కృష్ణల సంయుక్త దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. జూలై 24న థియేటర్లలో విడుదలకానున్న ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్, పాటల ద్వారా మంచి హైప్ సృష్టించింది.
05-07-2025న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన బహుజన సంఘాల సమావేశంలో బిసి నాయకుడు డాక్టర్ వై. శివ ముదిరాజ్ మాట్లాడుతూ, “హరిహర వీరమల్లు” @HHVMFilm @HHVMBookings సినిమా చరిత్రను వక్రీకరిస్తూ, పండుగ సాయన్న గారి వీరగాథను తారుమారు చేస్తూ, కల్పిత కథలు ప్రచారం చేస్తోంది. ఇది… pic.twitter.com/GLFRcY0as2
— Mudiraj Political Voice ముదిరాజ్ పొలిటికల్ వాయిస్ (@yamma7029) July 6, 2025
ఇప్పటికే ముదిరాజ్ సంఘాలు సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పండుగ సాయన్నను పోలిన కల్పిత పాత్రను సృష్టించి, ఆయన చరిత్రను తప్పుదారి పట్టించేలా చూపించారని ఆరోపిస్తున్నారు. ఇది బీసీ సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నమని మండిపడుతున్నారు.
తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న, దొరల సంపదను పేదలకు పంచిన యోధుడు అని వారు గుర్తుచేశారు. అలాంటి గొప్ప వ్యక్తిని వక్రీకరించడం అసహనానికి గురిచేస్తోందని చెప్పారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ముదిరాజ్ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ, డబ్బుల కోసం చరిత్రను తప్పుగా చూపిస్తూ రూపొందించిన ఈ చిత్రాన్ని బహుజన సంఘాలు కలసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ‘మెగా సూర్య ప్రొడక్షన్’ నిర్మించిన ఈ సినిమాను విడుదల కాకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.