Robinhood Review: నితిన్ ‘రాబిన్ హుడ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

నటీనటులు: నితిన్, శ్రీలీల, డేవిడ్ వార్నర్ దేవదత్త నాగే, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, షైన్ టామ్ చాకో, లాల్ తదితరులు
దర్శకుడు: వెంకీ కుడుముల
నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: జీవి ప్రకాష్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటి

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన ‘రాబిన్ హుడ్’ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. గతంలో వీరి హిట్ కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ సినిమా సక్సెస్ కావడంతో, ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ హైప్ ఏర్పడింది. కథ, కామెడీ, యాక్షన్.. ఈ మూడింటినీ బలంగా మిక్స్ చేసిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా?

కథ:

రామ్ (నితిన్) అనాథ. శుభలేఖ సుధాకర్ నిర్వహించే అనాథాశ్రమంలో పెరిగిన అతను, అక్కడి పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని అవలంబించి, ధనికుల నుంచి దొంగతనాలు చేస్తూ పేదలకు సహాయం చేస్తుంటాడు. అతని మాస్టర్ ప్లాన్లను ఛేదించేందుకు విక్టర్ (షైన్ చాం టాకో) రంగంలోకి దిగుతాడు.

దొంగతనాలకు గుడ్‌బై చెప్పిన రామ్, జానార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో (రాజేంద్ర ప్రసాద్) నడిపే సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు. అతని తొలి బాధ్యత నీరా వాసుదేవ్ (శ్రీలీల) అనే ఫార్మా కంపెనీ అధినేత కుమార్తెను కాపాడడం. కానీ ఈ మిషన్ సమయంలోనే రామ్, రుద్రకొండలో సామి (దేవదత్తా నాగే) ట్రాప్‌లో పడతాడు. అసలు ఈ మిషన్ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి? నీరా ఎందుకు టార్గెట్ అయ్యింది? రాబిన్ హుడ్ తన మెదడు, యాక్షన్ స్కిల్స్‌తో పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేశాడు? అనేదే కథ!

విశ్లేషణ:

ఈ కథ కొత్తదేమీ కాదు, కానీ కథనంలో ఉన్న ఎనర్జీ, కామెడీ పంచ్‌లు సినిమాను ఎంగేజింగ్‌గా ఉంచాయి. నితిన్ ఎంట్రీ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా వేగంగా సాగుతుంది. రాజేంద్ర ప్రసాద్, నితిన్, వెన్నెల కిశోర్ కాంబో కామెడీ పీక్స్ లో ఉంటుంది. ఇంటర్వెల్ బాంగ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్‌లో కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫైనల్ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ అద్భుతంగా ప్లాన్ చేశారు. కొన్ని సన్నివేశాలు ప్రెడిక్టబుల్‌గా అనిపించినా, కామెడీ & యాక్షన్ కాంబినేషన్ ఈ లోపాల్ని కవర్ చేస్తాయి.

నటీనటులు:

నితిన్ తన రాబిన్ హుడ్ స్టైల్ క్యారెక్టర్‌ను చాలా హుందాగా, అల్లరి యాంగిల్‌లో ప్రెజెంట్ చేశాడు. శ్రీలీల పాత్ర పెద్దగా స్కోప్ లేకపోయినా, తన అందం, ఎనర్జీతో స్క్రీన్‌ని లైట్ చేసింది. దేవదత్తా నాగే విలన్‌గా బాగా చేసినా, చివర్లో క్యారెక్టర్ సరిగ్గా డెవలప్ చేయలేదు. డేవిడ్ వార్నర్ స్పెషల్ అపీయరెన్స్ సినిమాలో ఓ స్పైసీ సర్‌ప్రైజ్ లా ఫీలయ్యాడు. అతని ఎంట్రీకి థియేటర్‌లో చప్పట్లు, విజిల్స్ ఊరమాస్! రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్ తనదైన కామెడీ టచ్‌తో నవ్వులు పూయించారు.

టెక్నికల్‌ అంశాలు:

జీవి ప్రకాష్ కుమార్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హై ఎనర్జీ ఇచ్చాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ లావిష్‌గా, స్టైలిష్‌గా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ లెవెల్‌లో ఉండేలా ప్లాన్ చేశారు. డైలాగ్స్ ట్రెండీగా, మాస్ తో కూడిన ఫన్ మిక్స్‌తో ఆకట్టుకున్నాయి. ఇక దర్శకుడు వెంకీ కుడుముల విషయానికి వస్తే దర్శకునిగా ఈ సినిమాకి మెప్పించాడు అని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ టేకింగ్ తనలోని స్టైలిష్ విజనరీ ఫిల్మ్ మేకర్ ని చూపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

నితిన్ పెర్ఫార్మెన్స్
రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కామెడీ
జీవి ప్రకాష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
యాక్షన్ సీక్వెన్స్‌లు
ట్విస్టులతో నడిచే సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్

స్టోరీ లో కొత్తదనం లేకపోవటం
సెకండ్ హాఫ్‌లో కామెడీ మిస్
క్లైమాక్స్ లో విలన్ క్యారెక్టర్

ఫైనల్ వర్డిక్ట్:

‘రాబిన్ హుడ్’ మంచి కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ ట్విస్టులతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. కథ పాతదైనా, దానిని నడిపించే విధానం & కామెడీ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి.

ప్రజ్ఞ మీడియా రేటింగ్: 3/5

Leave a Reply