Navya Nair : వామ్మో! మల్లెపూలు తీసుకెళ్లినందుకు రూ.1.14 లక్షల జరిమానా

భారతదేశంలో మహిళలు జడలో మల్లెపూలు పెట్టుకోవడం సాధారణ విషయం. కానీ ఆస్ట్రేలియా వంటి దేశాలకు మల్లెపూలను తీసుకెళ్లడం మాత్రం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.

ఇటీవలే మలయాళ నటి నవ్య నాయర్ ఈ తప్పిదానికి గురయ్యారు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో మల్లెపూల దండ గుర్తించి రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఈ ఘటనతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు – మల్లెపూలకు ఇంత పెద్ద జరిమానా ఏంటి అని!

నవ్య నాయర్ విక్టోరియాలోని మలయాళ అసోసియేషన్ నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనడానికి ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె తన బ్యాగ్‌లో సుమారు 15 సెం.మీ పొడవు మల్లెపూల దండ పెట్టుకున్నారు. అయితే సెక్యూరిటీ చెక్‌లో అది బయటపడటంతో కస్టమ్స్ అధికారులు కఠిన చర్య తీసుకుని జరిమానా విధించారు.

 

View this post on Instagram

 

A post shared by Navya Nair (@navyanair143)

ఆస్ట్రేలియాలో మొక్కలు, పూలు, పండ్లు, విత్తనాలు, జీవ సంబంధిత వస్తువులను అనుమతి లేకుండా తీసుకురావడం పూర్తిగా నిషేధం. కారణం.. ఇవి వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే అవకాశముందని భావిస్తారు.

ఈ ఘటనపై నవ్య మాట్లాడుతూ.. “మా నాన్న నాకు మల్లెపూలు ఇచ్చారు. ప్రయాణంలో పెట్టుకోవడానికి హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకున్నాను. కానీ ఇది చట్టానికి వ్యతిరేకమని నాకు తెలియదు. తప్పు తెలిసి చేసినది కాదు. అయినప్పటికీ తప్పు తప్పే. కేవలం 15 సెం.మీ మల్లెపూలకే రూ.1.14 లక్షల జరిమానా విధించారు” అని చెప్పారు.

జరిమానా విధించినా, ఆమె ఓనం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంఘటనను అక్కడే షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.

నవ్య నాయర్ మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు. ‘నందనం’, ‘కళ్యాణరామన్’ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అలాగే ఆమె రెండు సార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.

Leave a Reply