Nandamuri Balakrishna: బాలయ్యకు మరో అరుదైన గౌరవం.. ఆనందంలో నందమూరి అభిమానులు

నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం లభించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR) గోల్డ్ ఎడిషన్‌లో ఆయన పేరు నమోదు అయ్యింది. ఇండస్ట్రీలో 50 ఏళ్లకు పైగా అగ్ర హీరోగా కొనసాగుతున్న బాలయ్య సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించారు. భారతీయ సినీ పరిశ్రమలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి నటుడిగా బాలయ్య చరిత్ర సృష్టించారు. ఆగస్టు 30న హైదరాబాద్‌లో అధికారికంగా సత్కరించనున్నారు.

ఇదే సమయంలో, బాలయ్యకు ఇటీవల పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. సినిమా, సామాజిక రంగాల్లో ఆయన కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. అలాగే బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ఉత్తమ చిత్రం కేటగిరీలో జాతీయ అవార్డు గెలుచుకుంది. వరుస అవార్డులు రావడంతో నందమూరి కుటుంబం, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

దివంగత నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందుకున్న బాలయ్య, తనదైన శైలి నటనతో కోట్లాది అభిమానులను ఆకట్టుకున్నారు. విభిన్నమైన పాత్రల్లో మెప్పించి, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలతో రికార్డులు సృష్టించారు. ఏళ్ళు గడిచినా ఆయన క్రేజ్ తగ్గకపోవడం విశేషం. ఎక్కడైనా “జై బాలయ్య” నినాదాలు వినిపించడం ఆయన అభిమానాభిమానానికి నిదర్శనం.

Also read : ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన Jr. NTR అభిమానులు

సినిమా రంగంతో పాటు సమాజానికి కూడా సేవలందించిన బాలయ్య, హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి అభివృద్ధికి కృషి చేశారు. అలాగే బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలు ఈ గౌరవాలకు కారణమయ్యాయి.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో బాలయ్య యాక్షన్, డైలాగ్స్ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి.

Leave a Reply