KA Paul: విజయ్ దేవరకొండపై కేఏ పాల్ ఫైర్.. ‘బుద్దుండాలి.. ఇది ప్రజల ప్రాణాలతో ఆట కాదు!’

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గేమింగ్ యాప్‌ మాత్రమే ప్రమోట్ చేశానని విజయ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, కేఏ పాల్ తీవ్రంగా మండిపడ్డారు. విజయ్ చెప్పిన యాప్‌లు తెలుగు రాష్ట్రాల్లో నిషేధితమైనవే అని స్పష్టం చేశారు. “అవి లీగల్ అయితే, నిషేధం ఎందుకు విధించారు? ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం మానేయాలి. బుద్ధి ఉండాలి. నువ్వు చిన్న వయసు కుర్రోడివి, మంచి కోసం పోరాడాలి.. కానీ ఇలా ముప్పు కలిగించే యాప్స్ కోసం కాదు” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

డబ్బులు బాధితులకు ఇవ్వాలి – కేఏ పాల్ డిమాండ్
విజయ్ దేవరకొండ తక్షణమే క్షమాపణ చెప్పాలని, యాప్ ప్రకటనల ద్వారా సంపాదించిన మొత్తం డబ్బును బాధిత కుటుంబాలకు ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. “విజయ్ చేసిన యాడ్స్ చూసి ఎందరో యువకులు సూసైడ్ చేసుకున్నారు” అని పాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

ఈడీ విచారణలో విజయ్ వివరాలు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో భాగంగా విజయ్ దేవరకొండ నిన్న హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడుతూ, తాను ప్రచారం చేసినది A23 అనే గేమింగ్ యాప్ మాత్రమేనని, ఇది బెట్టింగ్ యాప్ కాదని చెప్పారు. ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందిన చట్టబద్ధమైన యాప్ అని తెలిపారు. తెలంగాణాలో ఆ యాప్ అందుబాటులో లేదన్న విషయాన్ని కూడా విజయ్ స్పష్టం చేశారు. ఈడీ అధికారులకు తన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు సహా అన్ని వివరాలు సమర్పించానని తెలిపారు.

సుప్రీంకోర్టుకు చేరిన కేసు
బెట్టింగ్ యాప్‌లపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ కేఏ పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యువతను నాశనం చేస్తున్న ఈ యాప్‌లపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రచారం చేస్తున్న సినీ నటులు, క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా తెలంగాణలో ఈ యాప్‌ల వల్ల 1,000కి పైగా ఆత్మహత్యలు జరిగాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Leave a Reply